ఢిల్లీలోనూ విశాఖ శారదా పీఠం సేవలు

12 Nov, 2021 04:53 IST|Sakshi

ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి

సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ శారదా పీఠం కార్యక్రమాలను దేశ రాజధాని ఢిల్లీకి సైతం విస్తరించాలని పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సంకల్పం అని, ఆ క్రమంలో అక్కడ ఆశ్రమం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి వెల్లడించారు. ఇందుకోసం స్థలం కేటాయించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని.. తెలుగు వారందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంలో ఆలయాన్ని, ఆశ్రమాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సనాతన ధర్మ పరిరక్షణలో శారదా పీఠం విశిష్ట సేవలందిస్తోందని, తాజాగా విశాఖ ఏజెన్సీ నుంచి గిరిజనులను తీర్థయాత్రలకు తీసుకెళ్లామని తెలిపారు. దళిత, గిరిజనుల కోసం ఎన్నో ధార్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉత్తరాదిన ఇప్పటికే తమకు కాశీ మహాక్షేత్రంతో పాటు రిషికేశ్‌ గంగానది తీరాన ఆశ్రమం ఉందని, హైదరాబాద్‌లోనూ నిర్మాణం పూర్తికాబోతుందని వెల్లడించారు.  

మరిన్ని వార్తలు