ఎంపీ అవినాష్‌కు ఊరట.. హైకోర్టు ఆర్డర్‌లోని కీలక అంశాలివే!

31 May, 2023 18:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డి పిటిషన్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ జస్టిస్ లక్ష్మణ్‌ ఇచ్చిన తీర్పులో చాలా కీలక అంశాలను పొందుపరిచారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన తీరు, దర్యాప్తు సంస్థల రికార్డులు, నిందితుల వివరాలను తన తీర్పులో పేర్కొన్నారు. 

హంతకులు వీరే
సీబీఐ దర్యాప్తు ఆధారంగా వివేకానందరెడ్డిని హత్య చేసింది గంగిరెడ్డి, యాదాటి సునీల్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి అని తేలింది

హత్యకు కారణాలేంటీ?
దర్యాప్తు సంస్తల విచారణ ఆధారంగా తేలింది ఏంటంటే, హత్య చేసిన నలుగురికి వివేకాతో వేరు వేరు వైరుధ్యాలున్నాయి
సంబంధిత వార్త: ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు

1. ఎర్ర గంగిరెడ్డి : వివేకా పలుమార్లు గంగిరెడ్డిని అందరి ముందు తిట్టడంతో పాటు రియల్ ఎస్టేట్ సెటిల్‌మెంట్‌ లావాదేవీల్లో విభేదాలు వచ్చాయి. 

2. సునీల్‌ యాదవ్‌: తనకు బెంగుళూర్ సెటిల్‌మెంట్‌లో డబ్బులు రాలేదని వివేకాపై ఆగ్రహంగా ఉన్నాడు. దీంతో పాటు రంగురాళ్లు, వజ్రాల లావాదేవీలలో వివేకాతో విభేదాలు వచ్చాయి. తన తల్లిపై వివేకా తప్పుడు ఆలోచనలతో ఉన్నాడని సునీల్ యాదవ్‌ వివేకాపై పగ పెంచుకున్నాడు. 

3. ఉమాశంకర్‌రెడ్డి: వివేకా తనకు సర్పంచ్‌ ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదనే కోపం ఉంది. తన భార్యపై వివేకా తప్పుడు ఆలోచనలతో ఉన్నాడని ఉమాశంకర్‌రెడ్డి కోపం పెంచుకున్నాడు. 

4. దస్తగరి: తనను డ్రైవర్‌గా తొలగించాడన్న కోపం వివేకాపై ఉంది. ఒక మహిళతో అక్రమ సంబంధం విషయంలో దస్తగిరికి వివేకాకు శత్రుత్వం ఉంది.
చదవండి: వివేకా హత్య కేసులో రాజకీయ కోణం ఎక్కడా లేదు: సజ్జల

ఎప్పుడెప్పుడు ఏం జరిగింది?
1. ఈ కేసులో ముందుగా టీడీపీ నాయకుడు ఆదినారాయణరెడ్డిపై అనుమానాలు వచ్చాయి. 

2. వివేకాను కుటుంబ సభ్యులే హత్య చేశారని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటనలు చేశారు. దీనిని తీవ్రంగా తప్పుబడుతు వివేకా కుమార్తే సునీతారెడ్డి ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసారు. 

3. ఆధారాలను పరిశీలిస్తే సంఘటనా స్థలంలో సాక్ష్యాధారాలను తుడిచేవేసే ప్రయత్నం జరిగినట్లు స్పష్టమవుతోంది. వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి సైతం ఆధారాలు దాచిపెట్టినట్లు స్పష్టమవుతోంది. హత్యకు ముందు వివేకా రాసిన ఉత్తరాన్ని దాచిపెట్టాలని వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి పీఏ కృష్ణారెడ్డికి చెప్పారు. 

4. సిబీఐ విచారణలో సేకరించిన వాంగ్మూలంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వివేకా హత్య కేసులో సంఘటనా స్థలంలో సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడంలో అవినాష్‌రెడ్డి పాత్ర ఉందనడానికి ఎలాంటి ఆధారం లేదు. 

5. సంఘటనా స్థలంలో ఆధారాలను గంగిరెడ్డి తుడిచేందుకు ప్రయత్నించినట్లు ఆధారాలు ఉన్నాయి. 

6. హత్య సమయంలో వివేకా నివాసంలో డాక్యుమెంట్ల కోసం గంగిరెడ్డి, యాదాటి సునీల్ వెతికినట్లు సీబీఐ దర్యాప్తు ద్వారా తెలుస్తోంది. నిందితులు ఆ డాక్యుమెంట్లను తమతో పాటు తీసుకెళ్లారు. డాక్యుమెంట్లను తమతో పాటు తీసుకెళ్లే ముందు డాక్యుమెంట్లను పరిశీలించుకున్నారని అప్రూవర్‌గా మారిన దస్తగిరి స్పష్టంగా చెప్పారు. గంగిరెడ్డి, యాదాటి సునీల్‌ హత్య సమయంలో వ్యవహరించిన తీరును బట్టి ఈ డాక్యుమెంట్ల కోసమే హత్య జరిగినట్లు అర్ధమవుతోంది.

7. ఈ డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయో ఇప్పటి వరకు సీబీఐ తేల్చలేకపోయింది. ఈ డాక్యుమెంట్లు దొరికితే హత్యకు అసలు ఉద్దేశ్యాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. 

8. వివేకా హత్యకు ముందు 2019 ఫిబ్రవరి 10వ తేదీన గంగిరెడ్డి ఇంటి వద్ద బ్లాక్‌ బొలేరో వాహనంలో ముగ్గురు వ్యక్తులు ఉన్న విషయంపై వివరాలు సేకరించడంలో సీబీఐ విఫలమైంది. 

ఇది కూడా చదవండి: ఇది వ్యక్తిగత దాడి మాత్రమే కాదు.. అవినాష్‌ పిటిషన్‌ విచారించిన న్యాయమూర్తి ఆవేదన

9. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాష్‌రెడ్డికి సంబంధం ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు లేవు. 

10. కడప ఎంపి టికెట్‌ కోసమే వివేకా హత్య జరిగిందనేది కేవలం ఊహజనితమే. సీబీఐ సేకరించిన వాంగ్మూలాలలోనే వివేకా కడప నుంచి పోటీ చేయాలనుకోలేదని స్పష్టం అవుతోంది. 

11. వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి వాంగ్మూలంలో ఒక విషయం స్పష్టమవుతోంది. వివేకా హత్య కన్నా ముందే ఎంపీ టికెట్‌కు అనధికారికంగా అవినాష్‌రెడ్డి పేరు ఖరారు అయినట్లు రాజశేఖర్‌రెడ్డి చెప్పినదాన్ని బట్టి స్పష్టమవుతోంది. 

12. కడప ఎంపీగా అవినాష్‌రెడ్డిని గెలిపించేందుకు తన తండ్రి  ప్రయత్నించారని ఆయన కుమార్తె సునీతారెడ్డి పలుమార్లు చెప్పారు. 

13. హత్యకు ఒకరోజు ముందు కూడా అవినాష్‌రెడ్డి కోసం వివేకా ప్రచారం చేసినట్లు ఆధారాలు ఉన్నాయి.

14. గతంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సమయంలో సునీతారెడ్డి.. అవినాష్‌రెడ్డి క్యార్టర్‌లోనే బసచేసారు. ఒకవేళ వివేకాను హత్య చేసింది అవినాష్‌రెడ్డి అయితే సునీతా ఆయన క్యార్టర్‌లో షెల్టర్ తీసుకునేవారా? అవినాష్‌రెడ్డితో తమ తండ్రికి శత్రుత్వం ఉందని వివేకా కుటుంబ సభ్యులు ఆరోపించలేదు. 

15. దస్తగిరి స్టేట్‌మెంట్ రికార్డు చేయడానికి ఏడాది ముందుగానే 46 లక్షల రూపాయలు రికవరి చేశారు. అయినా దస్తగిరిని అరెస్టు చేయలేదు. 

16. ఇక ఈ కేసులో దస్తగిరిని సీబీఐ అప్రూవర్‌గా గుర్తించక ముందు నుంచే సీబీఐ తనను అరెస్టు చేయదనే ధీమా దస్తగిరికి వచ్చేసింది. 

17. తన తొలి స్టేట్‌మెంట్‌లో ఎక్కడా అవినాష్‌రెడ్డి పేరు చెప్పని దస్తగిరి తరువాత కాలంలో అవినాష్‌రెడ్డికి కుట్రలో భాగం ఉందనే స్టేట్‌మెంట్ ఇచ్చారు. 

18. హత్య జరిగిన రాత్రి ఏ-2గా ఉన్న యాదాటి సునీల్‌ యాదవ్‌ అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్లు ఆధారాలున్నాయని సీబీఐ అంటోంది. సీబీఐ ప్రకారం హత్య జరిగిన రాత్రి 1.58నిమిషాలకు యాదాటి సునీల్‌ అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నారు. అయితే సిబీఐ సాంకేతిక నిపుణుడు ఇచ్చిన సమాచారం పూర్తి భిన్నంగా ఉంది. సీబీఐ సాంకేతిక నిపుణుడు తన  వాంగ్మూలంలో యాదాటి సునీల్‌ 2.42నిమిషాలకు అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నారని చెబుతున్నారు. ఈ రెండు వాదనలలో వైరుధ్యం కనిపిస్తోంది. పరస్పర తేడాలున్నట్టు తెలుస్తోంది. 

19. CC టీవి వీడియో క్లిప్‌లో తెల్లవారు జామున 3.15నిమిషాలకు ఉమాశంకర్‌రెడ్డి రోడ్డుపై పారిపోతున్నట్లు కనిపించింది. ఒక వేళ CBI చెబుతున్నట్టు 1.30కు హత్య జరిగితే 3.15కు నిందితుడు ఎందుకు పారిపోతున్నట్టు కనిపిస్తాడు? వివేకా ఇంటికి కేవలం వంద మీటర్ల దూరంలో ఉన్నప్రాంతానికి చేరుకోడానికి 2 గంటలు పట్టదు కదా? హత్య జరిగాక యాదాటి సునీల్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి ముగ్గురు ఒకేసారి అక్కడి నుంచి తన వాంగ్మూలంలో దస్తగిరి చెప్పాడు. 

20. గత రెండున్నరేళ్లలో అవినాష్‌రెడ్డికి వివేకా హత్యతో సంబంధం ఉన్నట్లు CBI ఎలాంటి ఆధారాలు సేకరించలేదు. సీబీఐ సమన్లు ఇచ్చిన 7సార్లు అవినాష్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు