సాయి సందీప్‌ పరుగు తీస్తే పతకమే!

15 Dec, 2021 09:32 IST|Sakshi

సబ్బవరం (పెందుర్తి ): మండలంలోని సబ్బవరానికి చెందిన యువ క్రీడాకారుడు సాయి సందీప్‌ అథ్లెటిక్స్‌లో విశేషంగా రాణిస్తున్నాడు. జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నాడు. చిన్ననాటి నుంచి క్రీడలపై మక్కువ ఎక్కువ. ఈ నేపథ్యంలో అథ్లెటిక్స్‌లో రాణించాలని కలలుగన్నాడు. వాటిని నిజం చేసుకుంటూ ముందుకు పరుగులు  తీస్తున్నాడు. సరైన వసతులు, శిక్షణ అందించే కోచ్‌లు లేకపోయినా ఏకలవ్యుడి మాదిరిగా పరుగులో మేటిగా నిలుస్తున్నాడు సాయి సందీప్‌.

ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఇంటర్‌ స్పోర్ట్స్‌  గేమ్స్‌లో 400 మీటర్ల రిలేలో స్వర్ణం, 400 మీటర్ల పరుగు పందెం వ్యక్తిగత విభాగంలోనూ వెండి పతకాలను సాధించి జాతీయ స్థాయి పోటీలకు సాయి సందీప్‌ ఎంపికయ్యాడు. ఈ పోటీలను ఈ నెల 10,11,12వ తేదీలలో ఏయూ బోర్డు ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. మొత్తం 57 అనుబంధ కళాశాలలకు చెందిన 300 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. 


ఏయూలో నిర్వహించిన పోటీలో వెండి పతకం అందుకున్న సాయి సందీప్‌

కుటుంబ నేపథ్యం.. 
వాండ్రాసి సాయి సంందీప్‌ తల్లి సంపత వెంకటలక్ష్మి సచివాలయ ఆరోగ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుండగా, తండ్రి శ్రీనివాసరావు మార్కెటింగ్‌ విభాగంలో చిరుద్యోగిగా పనిచేస్తున్నారు. తమ్ముడు రోహిత్‌ విశాఖలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు 

4వ తరగతి నుంచి... 
4వ తరగతి నుంచి కడప జిల్లాలో డాక్టర్‌ వైఎస్సార్‌ స్టేట్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో చేరాడు. ఈ స్కూల్‌లో ప్రవేశానికి నిర్వహించిన జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభతో తన స్పోర్ట్స్‌ కెరియర్‌కు గట్టి పునాది వేసుకున్నాడు. పరుగు పందెం, దాంతో పాటు హర్డిల్స్‌లో ప్రత్యేక శ్రద్ధ చూపడంతో అక్కడున్నవారు ఆ దిశగా సాయి సందీప్‌ను ప్రోత్సహించారు. 
► 4వ తరగతి నుంచి పదో తరగతి వరకూ స్పోర్ట్స్‌ స్కూల్‌లో చదివి మొత్తం రెండు జాతీయ స్థాయిలో వెండి, రజిత పతకాలతో పాటు 18 రాష్ట్రస్థాయి బంగారు పతకాలను 
సాధించాడు. 
► ప్రస్తుతం విశాఖలోని డాక్టర్‌ లంకపల్లి బుల్లయ్య కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాడు.

నాటి టీడీపీ నగదు ప్రోత్సాహం ఇంకా అందలేదు
ప్రభుత్వం, స్పాన్సర్స్‌ నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తే  మరింత రాణించి అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా నాలో ఉందని సాయి సందీప్‌ చెబుతున్నాడు.  ప్రభుత్వంలో గుంటూరు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్‌ మెడల్‌ సాధించానని , అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తమ క్రీడా పురస్కారం అందజేశారన్నారు. దీంతో ప్రోత్సాహకంగా ప్రశంసాపత్రం, మెడల్‌తో పాటు ట్యాబ్, రూ.30 నగదు ప్రకటించారన్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం ప్రకటించిన నగదు ప్రోత్సాహక బహుమతి లభించలేదని సందీప్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. 

ప్రోత్సహిస్తే సత్తా చూపుతా 
సబ్బవరంలో తగిన క్రీడా సౌకర్యాలు, వసతులు లేవు. 400 మీటర్ల సింథటిక్‌ ట్రాక్, అనుభవం ఉన్న కోచ్‌ దగ్గర శిక్షణ పొందినట్లయితే మరిన్ని పతకాలు సాధించి, దేశం తరఫున ప్రాతినిథ్యం వహించి మరిన్ని పతకాలు సాధిస్తా. కోవిడ్‌ నేపథ్యంలో జాతీయ స్థాయి క్రీడలకు అంతరాయం ఏర్పడిందని, వచ్చే ఏడాది నిర్వహించనున్న పోటీలో పాల్గొని బంగారు పతకం సాధిస్తానని సందీప్‌ చెబుతున్నాడు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండటంతో డైట్, పౌష్టి కాహరం తీసుకోవడం, స్పోర్ట్స్‌ కిట్‌ తదితర వాటి కోసం ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుతున్నాడు. 


సాధించిన వివిధ పతకాలతో సాయి సందీప్‌


కోర్టులో పరుగు తీస్తూ...


పరుగు పందెంలో సాయి సందీప్‌

మరిన్ని వార్తలు