వైజాగ్‌ అబ్బాయి.. ఫిలిప్పీన్స్‌ అమ్మాయి.. లవ్‌ ఇన్‌ సింగపూర్‌..మధురవాడలో మూడు ముళ్లు..

9 Dec, 2022 10:38 IST|Sakshi

మధురవాడ(భీమిలి): వారి భాషలు.. మతాలే కాదు.. దేశాలు కూడా వేర్వేరు. అయినా వారి ప్రేమకు అవేమీ అడ్డుకాలేదు. సింగపూర్‌లో వారి పరిచయం ప్రేమగా మారగా.. మధురవాడలోని ఎంవీవీ సిటీలో పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. మధురవాడలో స్థిరపడ్డ పెండిమి శ్రీనివాస్, ఫిలిప్పీన్స్‌కు చెందిన జమేలాహ్‌ వివాహం గురువారం హిందూ సంప్రదాయ పద్ధతిలో అంగరంగవైభవంగా జరిగింది.

నగరంలోని శాలిపేటకు చెందిన శ్రీనివాస్‌ విశాఖ బుల్లయ్య కళాశాలలో డిగ్రీ పూర్తి తర్వాత పుణెలో ఎంబీఏ చదివారు. ఉద్యోగరీత్యా ఏడేళ్ల కిందట సింగపూర్‌ వెళ్లి అక్కడ హెచ్‌పీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. సింగపూర్‌లోనే శాప్‌(సిస్టమ్‌ అప్లికేషన్‌ ప్రొవైడర్‌)లో పనిచేస్తున్న ఫిలిప్పీన్స్‌కు చెందిన జమేలాహ్‌తో 4 ఏళ్ల కిందట పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది.

వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని.. ఇరు కుటుంబాలకు చెప్పి ఒప్పించారు. మన దేశంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలో మధురవాడలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. కాగా.. వీరిద్దరికీ కెనడాలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. త్వరలోనే కెనడా వెళ్లనున్నట్లు శ్రీనివాస్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు