హెచ్‌పీసీఎల్‌లో ప్రమాద స్థలాన్ని పరిశీలించిన విచారణ కమిటీ

29 May, 2021 09:34 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం:  విశాఖపట్నంలోని హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) రిఫైనరీలో జరిగిన ప్రమాద ఘటన స్థలాన్ని విచారణ కమిటీ  పరిశీలించింది. క్రూడ్ డిస్టిలరీ యూనిట్ 3 వద్ద ఆర్డీఓ పెంచల కిషోర్‌తో పాటు తొమ్మిది మంది కమిటీ సభ్యలు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుతోపాటు కారణాలపై ఆరాతీశారు. మరోసారి సైతం కమిటీ సభ్యులు హెచ్‌పీసీఎల్‌ సందర్ఙంచే అవకాశం ఉంది. అలాగే వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని విచారణ కమిటీకి కలెక్టర్‌ ఆదేశించారు.

కాగా విశాఖపట్నంలోని హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) రిఫైనరీలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో రిఫైనరీలోని పాత యూనిట్‌లో ట్యాంకర్‌ నుంచి అర కిలోమీటరు దూరంలో ఉన్న ముడిచమురు శుద్ధి ప్లాంట్‌ (సీడీ–3 ప్లాంట్‌)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలముకున్నాయి. స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమీప ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన హెచ్‌పీసీఎల్‌ అధికారులు.. సిబ్బందిని హుటాహుటిన బయటికి తరలించారు.

అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం అందించారు. ప్రమాదం జరిగినప్పుడు సీడీ–3 యూనిట్‌లో మేనేజర్‌తో పాటు నలుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. వీరి సమాచారంతో హెచ్‌పీసీఎల్‌ ఫైర్‌ సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. ముడిచమురు శుద్ధిచేసే క్రమంలో కొంత పెట్రోల్, డీజిల్‌ ఉత్పత్తులు కూడా ఉండటంతో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. బ్లోయర్‌ నుంచి రెండుసార్లు పేలుడు శబ్దాలు వినిపించాయి. 8 అగ్నిమాపక శకటాలతో పాటు, నేవల్‌ డాక్‌యార్డు విశాఖపట్నం బృందాలు, హెచ్‌పీసీఎల్‌ ఫైర్‌ సేఫ్టీ సిబ్బంది కలిసి గంటన్నరపాటు శ్రమించి సాయంత్రం 4.30 గంటలకు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు