విశాఖను వరించిన 'సాగరమాల'

8 Mar, 2021 17:28 IST|Sakshi

రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం

సాక్షి, న్యూఢిల్లీ: విశాఖను ఆంధ్రప్రదేశ్‌ కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన నాటి నుంచి అక్కడికి అనేక భారీ ప్రాజెక్ట్‌లు క్యూకడుతున్నాయి. తాజాగా ఆ ప్రాంతాన్ని మరిన్ని భారీ ప్రాజెక్ట్‌లు వరించాయి. ఏపీలో కేంద్రం ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన 'సాగరమాల' పథకంలో భాగంగా విశాఖకు అనేక భారీ నిర్మాణ ప్రాజెక్ట్‌లు దక్కాయి. సోమవారం రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఓడరేవులు, జలరవాణ, షిప్పింగ్‌ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సమాధానమిస్తూ ఈ వివరాలను వెల్లడించారు. 

సాగరమాల పథకం కింద రూ. 85, 576 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 92 రోడ్లు, రైల్, పోర్టులు, జెట్టీలు, జలరవాణా అభివృద్ధి ప్రాజెక్ట్‌లు మంజూరు కాగా, విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు 40 ప్రాజెక్టులు కేటాయించబడ్డట్లు ఆయన తెలిపారు. వీటిలో శ్రీకాకుళం జిల్లా బారువ, కళింగపట్నం పోర్టుల ఆధునీకరణ పనులు, విశాఖ జిల్లా భీమునిపట్నంలో ప్రయాణీకుల కోసం నిర్మించ తలపెట్టిన జెట్టీ నిర్మాణ ప్రాజెక్ట్‌, రూ.2,352 కోట్లతో విశాఖపట్నంలోని షీలా నగర్‌ జంక్షన్‌  నుంచి అనకాపల్లి, సబ్బవరం, పెందుర్తి మీదుగా ఎన్‌హెచ్‌ 16కు కలిసేలా రోడ్డు నిర్మాణం, రూ.138 కోట్ల వ్యయంతో గంగవరం పోర్టు నుంచి అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌ వరకు నాలుగు వరుసల బీచ్‌ రోడ్డు, ఎన్‌హెచ్‌ 16పై మింది నుంచి నాతయ్యపాలెం వరకు ఫ్లైఓవర్‌ నిర్మాణం, గంగవరం పోర్టు నుంచి విశాఖపట్నం పోర్టును కలిపేలా నాలుగు వరుసల కోస్టల్‌ రోడ్డు తదితర భారీ ప్రాజెక్ట్‌లున్నట్లు వెల్లడించారు.

కాగా, కేంద్రం మంజూరు చేసిన మొత్తం ప్రాజెక్ట్‌ల్లో రూ. 4,717 కోట్ల వ్యయంతో పోర్టు అధునీకరణ కింద 22 ప్రాజెక్ట్‌లు.. రోడ్డు, రైలు, జల రవాణా కనెక్టివిటీని పెంచేందుకు రూ. 47, 852 కోట్ల వ్యయంతో 54 ప్రాజెక్ట్‌లు.. పోర్టు పరిసర ప్రాంతాల్లో పారిశ్రామీకరణకు రూ. 32, 053 కోట్ల వ్యయంతో 10 ప్రాజెక్ట్‌లు.. కోస్టల్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌కు 952 కోట్ల వ్యయంతో కూడిన 6 ప్రాజెక్ట్‌లున్నాయి. ఈ మొత్తం ప్రాజెక్ట్‌ల్లో ఇప్పటి వరకు 25 వేల కోట్ల వ్యయంతో 28 ప్రాజెక్ట్‌లు పూర్తి చేసినట్లు, 51 వేల కోట్ల వ్యయంతో 29 ప్రాజెక్టుల్లో పనులు కొనసాగుతున్నట్లు, 8,945 కోట్ల వ్యయం కాగల 35 ప్రాజెక్ట్‌లు వివిధ దశల్లో ఉన్నట్లు కేంద్రమంత్రి మన్సుఖ్ వెల్లడించారు.

మరిన్ని వార్తలు