కరాటే క్వీన్స్‌: చదువులో సరస్వతీ పుత్రిక.. కరాటేలో వండర్‌ కిడ్‌

27 Apr, 2022 21:37 IST|Sakshi

అంతర్జాతీయ పోటీల్లో బాలికల సత్తా

పంజా విసిరితే.. పతకం ఖాయం 

‘నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులకు చెక్‌ పెట్టాలంటే ఆడపిల్లలకు కరాటే ఎంతో దోహదపడుతుంది. మా అమ్మానాన్నలు కరాటే నేర్చుకోవాలన్నప్పుడు మేం భయపడ్డాం. శిక్షణ పొందాక ఆ గొప్పతనం తెలిసింది. తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు కరాటే నేర్పించాలి.’
–  కరాటే విజేతలు

అగనంపూడి(గాజువాక): ఆత్మస్థైర్యం, స్వీయరక్షణతోపాటు అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటేందుకు బాలికలు కరాటేను ఎంచుకుని.. నిరంతర సాధన చేశారు. చదువుతో పాటు కరాటేలో శిక్షణ పొందుతూ.. సరిలేరు మాకెవ్వరూ అంటూ పతకాలు పంట పండిస్తున్నారు. వీరే కూర్మన్నపాలెం, దువ్వాడ, రాజీవ్‌నగర్‌ ప్రాంతాలకు చెందిన బాలికలు. వేపగుంటకు చెందిన చాంపియన్స్‌ కరాటే డోజో సారథ్యంలో జాతీయ కోచ్, బ్లాక్‌ బెల్ట్‌ ఫిప్త్‌ డాన్, జపాన్‌ కరాటే షోటోకై వి.ఎన్‌.డి.ప్రవీణ్‌కుమార్‌ పర్యవేక్షణలో వీరంతా శిక్షణ పొందుతున్నారు. వీరికి గంటా కనకారావు మెమోరియల్‌ సంస్థ సాయం అందిస్తోంది.  

నిర్వాహకుల చేతుల మీదుగా బంగారు పతకం అందుకుంటున్న మృదుల, హీరో సుమన్‌ నుంచి పసిడి పతకం అందుకుంటున్న రేష్మా

వండర్‌ కిడ్‌..రేష్మా 
చదువులో సరస్వతీ పుత్రిక.. కరాటేలో తన పంచ్‌లతో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించే వండర్‌ కిడ్‌.. పసిడి పతకాల పంట పండిస్తోంది పేడాడ రేష్మా. కూర్మన్నపాలెం సమీపంలోని మాతృశ్రీ లే అవుట్‌లో నివాసముంటున్న రేష్మా ఉక్కునగరంలోని ఓ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. 2019 నుంచి కరాటేలో శిక్షణ పొందుతోంది. ఇప్పటి వరకు రేష్మా తన పంచ్‌లతో రాష్ట్ర, జాతీయస్థాయిలో 8 బంగారు, 7 రజత, రెండు కాంస్య పతకాలు సాధించి ఈ ప్రాంత ప్రతిష్టను ఇనుమడింపజేసింది. తండ్రి పి.వరహాలరావు ఇండియన్‌ ఆర్మీ విశ్రాంత ఉద్యోగి. తల్లి ధనలక్ష్మి గృహిణి. అంతర్జాతీయ స్థాయిలో పసిడి పతకం సాధించి దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నదే ఆమె లక్ష్యం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతోపాటు కోచ్‌లు ఆమెను ప్రోత్సహిస్తున్నారు.  
చదవండి👉🏾 మానవత్వం చాటుకున్న హోంమంత్రి తానేటి వనిత

మృదుల.. పతకాల వరద 
దువ్వాడ విజ్ఞాన్‌ పబ్లిక్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎం.మృదుల కరాటేలో 2018 నుంచి శిక్షణ పొందుతోంది. చిన్నప్పటి నుంచి కరాటేపై ఆసక్తి పెంచుకున్న మృదుల ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 26 పసిడి పతకాలు, 6 రజతం, 7 కాంస్య పతకాలు సాధించి.. పదునైన పంచ్‌లతో ప్రత్యర్థులకు తన పవర్‌ చూపించింది. తండ్రి ఎం.సుధాకర్‌ ప్రైవేట్‌ కర్మాగారంలో పనిచేస్తుండగా.. తల్లి పద్మజ గృహిణి. మృదులను ఆది నుంచి ప్రోత్సహిస్తుండడంతో మెరుపు పంచ్‌లతో పతకాల వేట సాగిస్తోంది. కరాటేలో ప్రపంచ చాంపియన్‌గా నిలవాలన్నదే తన లక్ష్యమని చెబుతోంది.  

జాతీయ కోచ్‌ చేతుల మీదుగా పసిడి పతకం అందుకుంటున్న లిఖిత 

చరిత్రలో ఓ పేజీ లిఖించుకుంది 
నేటి సమాజంలో బాలికలు, మహిళల ఆత్మ రక్షణకు కరాటే ఒక ఆయుధం అని భావించే టి.లిఖిత ఎన్‌ఏడీ కొత్తరోడ్డులోని ఓ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. పాఠశాల విద్యార్థిగా ఉన్న రోజుల నుంచే కరాటేలో రాణిస్తోంది. చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొని పంచ్‌ విసిరితే పతకం వచ్చి తీరాల్సిందే. లిఖిత ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో 33 బంగారు పతకాలు, 3 రజతాలు, 4 కాంస్య పతకాలు తన ఖాతాలో జమచేసుకుంది. స్పోర్ట్స్‌ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలన్నది ఆమె లక్ష్యం. ఆమె తండ్రి వెంకట మహేష్‌ ప్రైవేట్‌ ఉద్యోగి. తల్లి గృహిణి. వీరిద్దరితోపాటు కోచ్‌లు కూడా తనకు ఆది నుంచి వెన్నంటి ప్రోత్సహిస్తున్నారని లిఖిత తెలిపింది.   
చదవండి👉 బుజ్జి పిట్ట.. బుల్లి పిట్ట.. పక్షి ప్రేమికుల విలక్షణ ఆలోచన

సాయి కీర్తనకు పతకం అందిస్తున్న నిర్వాహకులు  

‘కీర్తి’ ప్రతిష్టలు పెంచేలా..  
నగరంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న సీహెచ్‌ వేద సాయి కీర్తన.. కుటుంబంతో నిర్వాసితకాలనీలో నివాసం ఉంటోంది. 2018 నుంచి డోజో ఇన్‌స్టిట్యూట్‌లో కరాటే శిక్షణ కొనసాగిస్తోంది. సమాజంలో మహిళలు పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులను ఎదుర్కొడానికి కరాటే ఒక్కటే శరణ్యమని భావించి.. దానిపై ఇష్టం పెంచుకుంది. స్వీయ రక్షణతో పాటు కరాటేలో ఉత్తమ ప్రదర్శనతో విశ్వవిఖ్యాతగా నిలవాలన్నది ఆమె లక్ష్యం. ఇప్పటి వరకు 15 బంగారు, మూడు రజతం, 9 కాంస్య పతకాలతో మెరుపులు మెరిపించింది. తండ్రి సీహెచ్‌.రమేష్‌ ప్రైవేట్‌ ఉద్యోగి. తల్లి అర్చనా దేవి స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్నారు.  
చదవండి👉🏻 వారి జీవితాల్లో వెలుగు రేఖలు.. బతుకు చూపిన ‘భారతి’

మరిన్ని వార్తలు