21 ఏళ్ల తరువాత భారత్‌కు విశ్వసుందరి కిరీటం.. వైజాగ్‌ మోడల్స్‌ స్పందన

14 Dec, 2021 16:14 IST|Sakshi

హర్షం వ్యక్తం చేసిన విశాఖ మోడల్స్‌ 

130 కోట్ల మంది భారతీయుల ఆశలను నిజం చేసి.. విశ్వ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది భారతీయ యువతి హర్నాజ్‌ సంధు. ఇజ్రాయేల్‌లోని ఇలాట్‌ నగరంలో జరిగిన 70వ మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో విజేతగా నిలిచింది. దీంతో మోడల్‌ సిటీగా దినదినాభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో మోడల్స్‌ మురిసిపోయారు. జయహో హర్నాజ్‌ అంటూ అభినందనలు తెలిపారు. 21 ఏళ్ల తరువాత భారత్‌కు ఈ అరుదైన కిరీటం దక్కడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు. ఇప్పటికే ర్యాంప్‌పై మెరిసిపోతున్న ఎందరో మోడల్స్‌కు సంధు ఓ ధైర్యం..స్ఫూర్తి నింపిందని నగరానికి చెందిన ప్రముఖ మోడల్స్‌ తమ అభిప్రయాలను వ్యక్తం చేశారు. 
–బీచ్‌ రోడ్డు (విశాఖ తూర్పు)/ డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ) 


గర్వంగా ఉంది 
విశ్వసుందరిగా హర్నాజ్‌ కిరీటం దక్కించుకోవడం భారతీయ ఫ్యాషన్‌ రంగం గర్వపడేలా చేసింది. అందం, అభినయం, వాక్చాతుర్యంతో ఆమె ప్రపంచాన్ని జయించింది. కంగ్రాట్స్‌.. 
– మిస్‌ శిల్పానాయక్, మిస్‌ ఇండియా చార్నింగ్‌ విన్నర్‌–2021 

ప్రపంచం మురిసింది 
ఫ్యాషన్‌ ప్రపంచంలో ఇండియా మరోసారి మురిసింది. ర్యాంప్‌పై హర్నాజ్‌ మెరిసి ప్రపంచాన్ని జయించింది. 21 ఏళ్ల తరువాత మళ్లీ భారత్‌కు విశ్వసుందరి కిరీటం దక్కడం మాటల్లో చెప్పలేని ఆనందంగా ఉంది.  
– సంధ్యారాణి, మిసెస్‌ ప్రిన్సెస్‌ ఆంధ్ర

వావ్‌ హర్నాజ్‌ 
మాటల్లేవ్‌..ఆమె విజయం మాలో ఎంతో ఉత్సాహం నింపింది. ఓ భారతీయ మహిళకు విశ్వసుందరి కిరీటం ఎప్పుడు దక్కుతుందా అని ఎదురు చూసేదాణ్ని. 21 ఏళ్ల తరువాత ఆ కల హర్నాజ్‌తో తీరిపోయింది. గ్రేట్‌ సంధు. 
– సునీత, మిస్‌ ఆంధ్రప్రదేశ్‌–2021 

ఎందరికో ఆదర్శం 
ప్రోత్సాహం అందిస్తే ప్రపంచం మెచ్చేలా సత్తా చాటుకుంటామని హర్నాజ్‌ విజయంతో మరోసారి రుజువైంది. తను మాట్లాడే మాటలు అందరికీ ఆదర్శం. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్స్‌లో మాస్టర్స్‌ చేస్తూ  ఇండియా జెండాను  రెపరెపలాడించడం ఆనందంగా 
ఉంది. 
– లీలావతి, శ్రీమతి తెలుగు మహిళా విన్నర్‌

దేశం గర్వించదగ్గ రోజు
దేశం గర్వించదగ్గ రోజిది. హర్నాజ్‌ అటు చదువులోనూ, ఇటు మోడలింగ్‌లోనూ రాణించడం గొప్ప విషయం. ప్రతి మోడల్‌కు మిస్‌ యూనివర్స్‌ అనేది ఓ డ్రీమ్‌. అది కొందరికే సాధ్యం. భారత్‌కు చెందిన హర్నాజ్‌ ఈ ఫీట్‌ను 21 ఏళ్ల తరువాత సాధించడం చాలా గర్వంగా ఉంది. 
–వీరుమామ, ఇంటర్నేషనల్‌ ఈవెంట్‌ డైరెక్టర్‌

సూపర్‌ విజయం
దాదాపు 21 ఏళ్ల తర్వాత మిస్‌ యూనివర్స్‌ కిరీటం భారత్‌కు దక్కడం చాలా గర్వంగా ఉంది. మోడలింగ్‌ రంగంలోకి అడుగు పెట్టాలనే యువతకు హర్నాజ్‌ విజయం స్ఫూర్తి నింపింది.  
– సృజిత, 
మిస్‌ వైజాగ్‌ విన్నర్‌–2021

మరిన్ని వార్తలు