విశాఖలో విషాదం: కరోనాతో ఏడాది చిన్నారి మృతి

27 Apr, 2021 19:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రైవేటు ఆస్పత్రిలో లక్ష రూపాయలకు పైగా ఖర్చు

కోవిడ్‌ నిర్థారణ కావడంతో కేజీహెచ్‌కు తరలింపు

అడ్మిషన్‌ ఇచ్చేలోగా అంబులెన్స్‌లో చిన్నారి మృతి

సాక్షి, విశాఖపట్నం: కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ఏడాదిన్నర చిన్నారి కోవిడ్‌ బారిన పడి మృతి చెందింది. ఈ విషాద ఘటన మానవ హృదయాల్ని కలిచివేసింది. జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఓ చిన్నారికి మూడు రోజుల పాటు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఆఖరి క్షణంలో చిన్నారిని కేజీహెచ్‌కు తీసుకురాగా అడ్మిషన్ ఇచ్చే లోగా అంబులెన్స్‌లోనే ప్రాణం విడిచింది. తన బిడ్డను కాపాడాలని ఆ తల్లిదండ్రులు చేసిన రోదన కేజీహెచ్ పరిసరాల్లో విషాదం నింపిన ట్టు అయింది.

విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం చౌడుపల్లి గ్రామానికి చెందిన వీరబాబు సీఐఎస్ఎఫ్‌లో పని చేస్తున్నారు. ఇతనికి ఏడాది వయసు పాప జ్ఞానిత. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పాపకు నాలుగు రోజుల క్రితం జలుబు, జ్వరం, దగ్గు వచ్చింది. స్థానిక వైద్యుల సూచన మేరకు సన్‌రైజర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. దాదాపు లక్షల రూపాయలకు పైగా ఖర్చయింది. ఇంకా వ్యాధి నయం కాకపోవడంతో కోవిడ్‌ పరీక్షలు నిర్వహించారు.

దీంతో చిన్నారిలో పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. అక్కడి చిన్నారిని మరో కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ ఆసుపత్రి వైద్యులు కేజీహెచ్‌కు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో చిన్నారిని పట్టుకొని కుటుంబ సభ్యులు కింగ్ జార్జి ఆసుపత్రిలోని కోవిడ్‌ బ్లాక్‌కు అంబులెన్స్‌లో చేరుకున్నారు. ఆస్పత్రిలో అడ్మిషన్ పొందేలోగా చిన్నారి అంబులెన్సులోనే మృతి చెందింది. మూడు రోజుల పాటు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం ప్రయత్నించి ఆఖరి క్షణంలో చిన్నారి జ్ఞానిత మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదించారు. ఈ సంఘటన కేజీహెచ్ పరిసరాల్లో ప్రజలను ...రోగుల బంధువులను కలిచివేసింది

చదవండి: కరోనా సునామీ : దలైలామా సాయం

మరిన్ని వార్తలు