అతిథిలా వచ్చిన నగల దొంగ దొరికాడు

21 Jan, 2021 11:30 IST|Sakshi
మీడియాకి వెల్లడిస్తున్న సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా, నిందితుడు గంగాధర్‌రావు

సాక్షి, విశాఖపట్నం:  పెళ్లికి వచ్చిన  అతిథిలా  రిసార్ట్స్‌లోకి ప్రవేశించాడు. అంతా కలయతిరిగాడు. విందు భోజనం  ఆరగించాడు. ఆపై పెళ్లి కుమార్తె నగలతో చాలా దర్జాగా ఓలా క్యాబ్‌లో ఉడాయించాడు. 53 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసిన పాత నేరస్తుడు పోకతోట గంగాధర్‌రావు(29)ను నగరపోలీసులు పట్టుకున్నారు. అతనినుంచి  రూ. 26.5 లక్షల విలువైన 53 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సాయిప్రియ రిసార్ట్స్‌లో గత నెల 24న ఓ వివాహ వేడుకలో జరిగిన చోరీ కేసును ఛేదించారు. ఆ వివరాలను  నగర పోలీస్‌ కమిషనర్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో  సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా బుధవారం మీడియాకు వెల్లడించారు.
చదవండి: స్వామీజీల మాయాజాలం.. లబోదిబోమంటున్న రైతులు

తెల్లారితే పెళ్లి.. 
ఓ తహసీల్దార్‌ కుమారునికి, మునగపాక మండలం సినసపల్లి తోటాడకు చెందిన టీచర్‌ కుమార్తెకు గత నెల 24న ఉదయం 11 గంటలకు వివాహ ముహూర్తం నిశ్చయించారు. తెల్లారితే పెళ్లి జరగాల్సిన సమయంలో వధువు గదిలో ఉంచిన 53 తులాల బంగారు ఆభరణాల బ్యాగు చోరీకి గురైంది. వధువు తల్లిదండ్రులు 100కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు క్లూస్‌టీం, డాగ్‌స్క్యాడ్‌తో తనిఖీలు చేసినా లాభం లేకపోయింది.  


దొంగిలించిన అభరణాలు

ఆభరణాలు తాకట్టు పెట్టి జల్సాలు 
విజయవాడకు చెందిన పాత నేరస్తుడు పోకతోట గంగాధర్‌రావు చిన్నప్పటి నుంచి బెంజ్‌ సర్కిల్‌లోని అనాథ ఆశ్రమంలో పెరిగాడు. గతంలో విజయవాడ సమీపంలో 7 కేసుల్లో నిందితుడు. విజయవాడ నుంచి విశాఖకు వచ్చి సిరిపురంలోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పని చేశాడు. అది మానేసి విశాఖలో చోరీలు చేయడం మొదలుపెట్టాడు. 10 కేసుల్లో నిందితుడు. మూడేళ్ల పాటు జైలులో కూడా ఉన్నాడు. జైలు నుంచి ఇటీవల విడుదలైన గంగాధర్‌ గత నెల 24న రాత్రి సాయిప్రియ రిసార్ట్స్‌లో జరిగిన వివాహ వేడుకలో భోజనం చేశాడు. వధువు ఆభరణాలపై కన్నేశాడు. ఆమెకు కేటాయించిన 301 గదికి వెనక వైపు తక్కువ ఎత్తులో కిటీకీలుండడం, ఆ గదికి వెనుక వైపున వెలుతురు అంతగా లేకపోవడంతో.. చోరీకి స్కెచ్‌ వేశాడు. అక్కడి నుంచి బ్యాగ్‌ పట్టుకుని రోడ్డుపైకి వచ్చి ఓలా క్యాబ్‌ బుక్‌ చేసుకుని శ్రీకాకుళం వెళ్లిపోయాడు. సోంపేటలోని మనప్పురం గోల్డ్‌ ఫైనాన్స్‌లో 6 తులాలు తాకట్టు పెట్టాడు. ఆ డబ్బులతో తిరిగి విశాఖకు వచ్చి జల్సాలు చేస్తున్నాడు.  

సీసీ కెమెరాలతో దొరికిన దొంగ జాడ 
రిసార్ట్స్‌లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దొంగ జాడను పోలీసులు కనిపెట్టారు. నగరంలో జల్సాలు చేస్తున్న గంగాధర్‌ను మంగళవారం మధ్యాహ్నం పూర్ణామార్కెట్‌లో అరెస్ట్‌ చేశారు. తాకట్టు పెట్టిన ఆరు తులాలతో సహా మొత్తం 53 తులాల బంగారు ఆభరణాలను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు.  

సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి 
ఈ సందర్భంగా సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా మాట్లాడుతూ నగరంలోని రిసార్ట్స్, ఫంక్షన్‌ హాల్స్, హోటల్స్, రెస్టారెంట్లలో సీసీ కెమెరాలు  తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని చెప్పారు. మరో పదిహేను రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. లేకపోతే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఇప్పటికే నగరంలో రాత్రి గస్తీ పెంచామన్నారు. 333 మంది పోలీసులతో వార్డు రక్షక దళాలను నియమించినట్టు చెప్పారు. అనంతరం కేసును ఛేదించిన పోలీసులకు సీపీ ప్రశంసా పత్రాలు అందజేశారు. డీసీపీ క్రైం సురేష్‌బాబు, ఏడీసీపీ క్రైం వేణుగోపాలనాయడు, ఏసీపీ (క్రైం)శ్రావణ్‌కుమార్, సీఐలు అవతార్, రామచంద్రరావు, సీహెచ్‌.సూరినాయడు, ఎస్‌ఐలు జి.అప్పారావు, పి.శివ, కె.మధుసూదనరావు, సోమేశ్వరరావు, ఏఎస్‌ఐలు శ్రీనివాసరాజు, రాజు, శేఖర్, పి.చిన్నరాజు, సిబ్బంది లక్ష్మణ్, ఎం.శేకర్, కె.వి శ్రీధర్, ఎ.దిలీప్, సోమశేఖర్‌లను అభినందించారు. చోరీ సొత్తును రికవరీ చేసిన పోలీసులకు వధువు, ఆమె తండ్రి రామ కోటేశ్వరారవు  ధన్యవాదాలు తెలిపారు.  నగలు పోయినప్పటి నుంచి మాకు కంటి నిండా నిద్ర కరవైందని వారు తెలిపారు. 28 రోజుల్లో దొంగను పట్టుకుని ఆభరణాలు అప్పగించిన సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా, డీసీపీ(క్రైం) సురేష్‌బాబుకు ప్రత్యేక 
కృతజ్ఞతలు చెప్పారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు