Visakhapatnam: నగర అందాలను చూస్తూ షిప్‌లో విహారం

30 Oct, 2022 18:56 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : సముద్రాన్ని చూస్తే.. ఎవరైనా చిన్న పిల్లాడిలా మారిపోవాల్సిందే. ఎగసిపడే కెరటాల్లా మనసు కేరింతలు కొట్టించే.. సాగరతీరంలో పడవ ప్రయాణమంటే..? గుండె ఆనందంతో గంతులేస్తుంది. పిల్లగాలి అల్లరి చేస్తుంటే.. నీలి కెరటాలతో పోటీ పడుతూ అలలపై ఆహ్లాదకరమైన విహారయాత్ర.. విశాఖ వాసుల్ని రా.. రమ్మని ఆహ్వానిస్తోంది. నగర అందాల్ని చూస్తూ.. ఆనంద ‘సాగరం’లో మునిగిపోతూ.. ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి రుషికొండ వరకూ షిప్‌లో సుమారు 2 గంటల పాటు విహరించే అవకాశం అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. పర్యాటకులకు మర్చిపోలేని మధుర స్మృతులు మిగిల్చేలా సాగరంలో విహారానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎంతో కాలంగా లాంచీల ప్రయాణం కోసం ఎదురు చూస్తున్న ప్రకృతి ప్రేమికులు.. పర్యాటకులకు ఆనందంతో పాటు మానసిక ఉల్లాసం అందించేందుకు ఎంఎస్‌ఎస్‌ క్లాస్‌–6 షిప్‌ అందుబాటులోకి రానుంది. ఒకేసారి 54 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఈ షిప్‌ని గుజరాత నుంచి తీసుకురానున్నారు. నగర అందాల్ని చూస్తూ.. ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి రుషికొండ వరకూ జల విహారం చేసేలా చర్యలు చేపడుతున్నారు. 

2 గంటల పాటు సముద్రంలో.. 
ఇటీవల క్రూయిజ్‌ షిప్‌ కనువిందు చేసింది. కానీ.. ఇందులో సామాన్యులు మాత్రం ప్రయాణం చేయలేని పరిస్థితి. ఒక్కసారైనా సాగరతీరంలో షిప్‌లో విహరించాలన్న కోరిక.. ఈ ప్రయాణంతో తీరిపోనుంది. సుమారు 2 గంటల పాటు సముద్రంలో ప్రయాణించవచ్చు. షిప్‌లో డెక్‌ మీదకు వచ్చి నగరాన్ని చూసేందుకు కూడా వీలు కలి్పంచనున్నారు. సముద్ర తీరం నుంచి అరకిలోమీటరు నుంచి కిలోమీటరు దూరం వరకూ లోపల నౌకాయానానికి అవకాశం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 

ఇప్పటికే డ్రై డాక్‌ అనుమతి 
షిప్‌ ప్రయాణానికి సంబంధించి.. పోర్టు చైర్మన్‌ కె.రామ్మోహన్‌రావుతో జిల్లా కలెక్టర్‌ డా.మల్లికార్జున, పర్యాటక శాఖ రీజనల్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు ఇటీవలే సంప్రదింపులు చేశారు. బోటు విహారానికి పోర్టులో అవకాశం కలి్పంచేందుకు అనుమతులివ్వాలన్న ప్రతిపాదనలు పంపించారు. దీనికి విశాఖపట్నం పోర్టు అథారిటీ అంగీకరిస్తూ.. డ్రైడాక్‌లో రాకపోకలకు అనుమతులు మంజూరు చేసింది.

త్వరలోనే..
అతి త్వరలోనే అలలపై షికారు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్‌ మల్లికార్జున చెప్పారు. విశాఖ పర్యాటకానికి ఎంఎస్‌ఎస్‌ క్లాస్‌–6 షిప్‌ మరో ఆభరణంగా మారనుందన్నారు.

లగ్జరీ ప్రయాణంలా..
బోటు ఎక్కామా... రుషికొండ వరకూ ప్రయాణించామా అన్నట్లుగా కాకుండా.. పర్యాటకులకు మధురానుభూతుల్ని అందించేందుకు కూడా ప్రణాళికలు చేస్తున్నారు. షిప్‌లో ప్రయాణిస్తున్న సమయంలో స్నాక్స్, టీ అందించనున్నారు. కొన్ని గదులు కూడా షిప్‌లో ఉండటంతో అందులో ఏసీ, టీవీ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఓపెన్‌ ఎయిర్‌ ప్రయాణంతో పాటు.. ఏసీ గదిలో ప్రయాణం.. అనేరీతిలో రెండు భాగాలుగా టికెట్‌ ధరని నిర్ణయించనున్నారు. బోట్‌ ఆపరేటింగ్‌ ద్వారా వచ్చే ఆదాయంలో 8 శాతం ఇవ్వాలని కోరనున్నారు. ఇందుకోసం అన్ని ప్రభుత్వశాఖల నుంచి నిరంభ్యంతర పత్రాలన్నీ (ఎన్‌వోసీ) ప్రభుత్వమే జారీ చేసి ఇస్తుంది. అన్నీ సక్రమంగా పూర్తయితే.. ఈ ఏడాది చివర్లోనే విశాఖ వాసులతో పాటు.. వైజాగ్‌ని సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు బోటులో షికారు చేసే అవకాశం కలుగుతుంది.

మరిన్ని వార్తలు