విశాఖ స్టీల్‌ప్లాంట్‌ వద్ద ఉద్రిక్తత

29 Jul, 2021 09:46 IST|Sakshi

విశాఖ పట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవెటీకరణపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కేంద్రం అఫిడివిట్‌ దాఖలు చేయడంపై ఉద్యోగులు ఆగ్రహం చేస్తున్నారు. గురువారం.. స్టీల్‌ప్లాంట్‌లో ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్వంలో ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. పెద్ద ఎత్తున స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగస్తులు పరిపాలన భవనం వద్దకు చేరుకుంటున్నారు. దీంతో పరిపాలన భవనం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అంతే కాకుండా విధులకు వెళుతున్న కార్మికులను ఉద్యోగస్తులు అడ్డుకుంటున్నారు. 

కాగా, విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో బుధవారం అఫిడవిట్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం తన అఫిడవిట్‌లో పలు కీలక అంశాలను పొందుపరిచింది. స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని, అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తామని పేర్కొంది. ఉద్యోగులు స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ వద్దనడం సరికాదని తెలిపింది. 

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేబినెట్ నిర్ణయం తీసుకుందని, స్టీల్‌ప్లాంట్‌ను 100శాతం ప్రైవేటీకరణ చేస్తామని అఫిడవిట్‌లో చెప్పింది. ఇప్పటికే బిడ్డింగ్‌లు ఆహ్వానించామని పేర్కొంది. అదే విధంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పిల్ వేసిన జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఎన్నికల్లో పోటీచేశారని, రాజకీయ లబ్ధి కోసమే ఆయన పిటిషన్ వేశారని తెలిపింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని కేంద్రం ప్రభుత్వం ఏపీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.కేంద్రం చర్యలపై స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు భగ్గుమంటున్నారు.

మరిన్ని వార్తలు