పార్వతీపురం కేంద్రంగా  కొత్త జిల్లా?

14 Nov, 2020 11:31 IST|Sakshi

కొత్త ఐటీడీఏ భవనమే కలెక్టరేట్‌ 

ఎస్‌పీ కార్యాలయానికి రెండు  భవనాలు

ప్రస్తుత కోర్టుభవనంలోనే జిల్లాకోర్టు 

ప్రతిపాదించిన జిల్లా  అధికారులు 

సాక్షి, విజయనగరం గంటస్తంభం: జిల్లా విభజన వ్యవహారం ఒక కొలిక్కివచ్చినట్టుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఉన్నతాధికారులు అడిగిన సమాచారం కొంతవరకు జిల్లా అధికారులు పంపించారు. మరింత సమాచారం అప్‌లోడ్‌ చేసే పనిలో ఉన్నారు. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం పార్వతీపురాన్ని జిల్లా కేంద్రంగా భావిస్తున్నారు. అందుకు కీలకమైన కార్యాలయాలకు అవసరమైన భవనాలను గుర్తించి సమాచారం పంపించారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లాల విభజనకు చేపట్టిన కసరత్తు జిల్లాలోనూ కొనసాగుతోంది. దీనికోసం ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కమిటీ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. వారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన సబ్‌ కమిటీలు జిల్లాలో భౌగోళిక పరిస్థితులు, భవనాలు, సిబ్బంది, ఇతర వివరాలు సేకరిస్తున్నాయి. 

కార్యాలయాలకు భవనాల గుర్తింపు 
రాష్ట్ర కమిటీలో ఒకరైన ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు. పార్వతీపురం డివిజన్‌ కేంద్రంలో కీలకమైన కార్యాలయాలకు అవకాశం ఉన్నభవనాలు గుర్తించి ఇవ్వాలని సూచించారు. దీనిపై పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ను ప్రతిపాదనలు కోరారు. ఆయన కలెక్టరేట్,  ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టుకు సంబంధించి వివరాలు పంపించారు. కలెక్టరేట్‌కు ఐటీడీఏకోసం కొత్తగా నిర్మి స్తున్న భవనం, ఎస్పీ కార్యాలయానికి ప్రస్తుత డీఎస్‌పీ కా ర్యాలయం, ప్రత్యామ్నాయంగా యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(వైటీసీ), జిల్లా కోర్టుకు ప్రస్తుతం ఉన్న సీనియర్, జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టును సూచించారు. వాటి విస్తీర్ణం, అందులో భవనాల విస్తీర్ణం, ఖాళీగా ఉన్న స్థలం విస్తీర్ణం వివరాలు మ్యాప్‌లతో సహా నివేదించగా వాటిని కలెక్టర్‌ ముఖ్య కార్య దర్శి కార్యాలయానికి పంపించారు.

భౌగోళిక పరిస్థితులపై నివేదిక 
జిల్లాకు సంబంధించి బౌగోళిక పరిస్థితులు కూడా ఇక్కడి అధికారులు పంపించారు. ప్రస్తుతం ఉన్న జిల్లా విస్తీర్ణం 6539 చదరపు కిలోమీటర్లు కాగా ఇందులో ప్రస్తుతం ఉన్న మండలాల వారీగా జనాభా, కుటుంబాల వివరాలు పంపించారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 6,85,585 కుటుంబాలుండగా 23,44,439 జనాభా ఉన్నట్టు తేల్చారు. మండలాల వారీగా ఉన్న ఈ సమాచారం పంపించారు. ప్రభుత్వం వద్ద ఏ మండలం ఏ నియోజకవర్గంలో ఉందో సమాచారం ఉన్నందున వీటి ఆధారంగా విభజన పక్రియ చేపడతారని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని భవనా ల వివరాలు కూడా అన్‌లైన్‌లో సంబంధిత సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు.

జిల్లా, డివిజన్‌ కార్యాలయాల భవనాలతోపా టు మండలస్థాయిలో ఉన్న భవనాలు గుర్తించారు. జిల్లాలో మొత్తం 106 శాఖలున్నాయి. ఇందులో విజయనగరంలో 106శాఖలు ఉండగా పార్వతీపురంలో 37 శాఖలున్నాయి. ఈశాఖల పరిధిలో మొత్తం 387 భవనాలు ఉన్నట్లు గుర్తించారు. విజయనగరం డివిజన్‌లో 252, పార్వతీపురం డివిజన్‌లో 387 భవనాలు గుర్తించారు. ఆ వివరాలు అప్‌లోడ్‌ అవుతున్నాయి. జిల్లాలో శాఖల వారీగా అధికారులు, సిబ్బంది వివరాలు సిద్ధమవుతున్నాయి. శాఖల వారీగా పార్వతీపురం వెళ్లాల్సిన అధికారులు, సిబ్బంది జాబితాపై ఉన్నతాధికారుల సూచన మేరకు కసరత్తు చేస్తున్నారు.

డేటా పంపిస్తున్నాం 
విభజన ప్రక్రియకు సంబంధించి నాలుగు కమిటీలను కలెక్టర్‌ ఏర్పాటు చేశారు. వారి ఆధ్వర్యంలో వివరాలు సిద్ధం చేసి ఎప్పటికప్పుడు సమాచారం అప్‌లోడ్‌ చేస్తున్నారు. పార్వతీపురంలో కలెక్టరేట్, ఎస్‌పీ కార్యాలయం, జిల్లా కోర్టుకు భవనాలు గుర్తించి సూచించాలని ఉన్నతాధికారులు కోరగా ఆ సమాచారం కలెక్టర్‌ పంపించారు. కార్యాలయాలు, సిబ్బంది తదితర వివరాలు విభజనకు సంబంధించి ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. 
– ఎం.గణపతిరావు, డీఆర్వో, విజయనగరం 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా