నీటిని నిలిపి.. పొలాలు తడిపి..

24 Nov, 2020 20:27 IST|Sakshi

అడారు గెడ్డ మధ్యలో రాళ్లువేసి నీటిని మళ్లిస్తున్న గిరిజనులు

వందెకరాల్లో రెండు పంటలు పండిస్తున్న వైనం

ఆదర్శంగా నిలిచిన గుంటబద్ర గ్రామస్తులు

కష్టాలు ఆలోచనలకు పదునుపెట్టాయి. ఒక ఆలోచన దిశ చూపింది. సంకల్పం చేతులు కలిపింది. పొలం తడిసింది. జలం జీవం పోసింది. పంట పండింది. గ్రామస్తుల దశ మారింది. కళ్లముందే నీరున్నా పొలానికి అందక ఏళ్ల తరబడి ఇబ్బందులు పడిన ఆ గ్రామస్తులు ఇప్పుడు రెండు పంటలు పండిస్తున్నారు. నిరంతరం పారే నీటికి చిన్న అడ్డుకట్ట వేసి పొలాలకు మళ్లించారు. నీటి ఎద్దడే లేదు. వంద ఎకరాలు సస్యశ్యామలమయ్యాయి. నీరు లేక పంటలు పండించే అవకాశంలేక అటవీ ఉత్పత్తులు సేకరించి జీవనం గడిపిన వారు ఇప్పుడు స్వయంగా పంటలు పండించుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. ఈ ఘనత సాధించిన విజయనగరం జిల్లా మక్కువ మండలంలోని గుంటబద్ర గ్రామస్తులు.. అందరికీ ఆదర్శంగా నిలిచారు.

మక్కువ (సాలూరు): గుంటబద్ర గ్రామంలో సుమారు వంద గిరిజన కుటుంబాలున్నాయి. గ్రామం పక్కనే ప్రవహించే అడారు గెడ్డ ఉంది. ఒడిశా రాష్ట్రంలోని కొండలపైనుంచి నిరంతరం వచ్చే నీటితో ఈ గెడ్డ ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ పొలాలకు నీరందించే లక్ష్యంతో చేపట్టిన అదనపు ఆనకట్ట పనులు ఆగిపోవడంతో వరుణుడు కరుణిస్తేనే పంట పండేది. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలా అని అందరూ చర్చించుకున్నారు. అడారు గెడ్డ నీటిని ఎలా మళ్లించాలా అని ఆలోచించారు. గెడ్డకు అడ్డంగా రాళ్లు వేసి ప్రవాహాన్ని కొంత అయినా అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అందరూ కలిసి రాళ్లను సేకరించి అడారు గెడ్డ మధ్యలో గట్టులా వేశారు. అక్కడ ఆగిన నీరు పొలాలకు వెళ్లేలా కాలువ తవ్వారు. రాళ్ల మధ్య నుంచి కిందకు వెళ్లేనీరు పోగా కాలువకు వస్తున్న నీటితో వంద ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. ఖరీఫ్‌లో వందెకరాల్లో వరి పండించిన ఈ గ్రామస్తులు రబీ సీజన్‌లో 70 ఎకరాల్లో మొక్కజొన్న, 30 ఎకరాల్లో చిరుధాన్యాలు సాగు చేస్తున్నారు. 

అటవీ అభ్యంతరాలతో ఆగిన అదనపు ఆనకట్ట నిర్మాణం
మక్కువ, పార్వతీపురం, సాలూరు మండలాలకు చెందిన 1,876 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో మకు‍్కవ మండలం పనసబద్ర పంచాయతీ మూలవలస గ్రామ సమీపంలో 1955లో సురాపాడు చెక్‌డ్యాం నిర్మించారు. చెక్‌డ్యాం శిథిలావస్థకు చేరడం, కాలువల్లో పూడిక పేరుకోవడంతో ప్రస్తుతం వెయ్యి ఎకరాలకు కూడా నీరందడం లేదు. ఎగువనున్న కొండలపై నుంచి అడారుగెడ్డ ద్వారా వచ్చిననీరు వచ్చినట్లు వృథాగా పోతోంది. అడారుగెడ్డపై నుంచి వచ్చిన నీటిని నిల్వ చేసేందుకు సురాపాడు ప్రాజెక్టు దిగువన 2,500 ఎకరాలకు సాగు నీరందించేలా అదనపు ఆనకట్ట (మినీ రిజర్వాయర్‌) నిర్మించాలని దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తలపెట్టారు. ఇందుకోసం రూ.1.2 కోట్లు మంజూరుచేశారు. 2006 మే 28న అప్పటి రాష్ట్ర అటవీ పర్యావరణశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించిన ఆరు నెలలకే అటవీ శాఖాధికారులు అడ్డుకోవడంతో ఆగిపోయాయి. దీంతో మక్కువ మండలంలోని మూలవలస, ఆలగురువు, గుంటబద్ర, చెక్కవలస, నగుళ్లు, పార్వతీపురం మండలంలోని అడారు గ్రామాల పొలాలకు నీరందక ఏటా గిరిజన రైతులు నష్టపోతున్నారు. 

నీటి సమస్య తీరింది
గ్రామస్తులమంతా ఏకమై అడారు గెడ్డ మధ్యలో రాళ్లను గట్టులా వేశాం. కొంతమేర కిందకు వెళ్లగా మిగిలిన నీటిని కాలువ ఏర్పాటుచేసి పొలాలకు మళ్లిస్తున్నాం. మా పంటపొలాలకు నీరు సక్రమంగా అందుతోంది. పంటలు పండించుకుంటున్నాం.
- సీదరపు లాండు, గుంటబద్ర, రైతు 

పంటలు పండించుకుంటున్నాం
ఏటా వరుణదేవుడిపై ఆధారపడి పంటలు సాగుచేస్తూ నష్టపోతూనే ఉండేవాళ్లం. ఇప్పుడు అడారు గెడ్డ మధ్యలో రాళ్లతో గట్టుకట్టి నీటిని పొలాలకు మళ్లించుకున్నాం. పంటలు పండించుకుంటున్నాం. సంతోషంగా ఉంది.
- కర్రా రామారావు, గుంటబద్ర, రైతు 

కోర్టులో కేసు ఉంది
సురాపాడు ప్రాజెక్టు సమీపంలో 2006లో అదనపు ఆనకట్ట నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రదేశం రిజర్వ్‌ఫారెస్ట్‌ ఏరియాలో ఉంది. అందువల్ల అటవీ శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో కేసు వేసింది. ఇంతవరకు ఎటువంటి ఉత్తర్వులు అందలేదు. అందువల్ల పనులు అలాగే నిలిచిపోయాయి.
-కె.నారాయణరావు, అటవీ అధికారి, మక్కువ

మరిన్ని వార్తలు