బాల్‌ సరిగా వెయ్‌.. కరోనా బాధితులతో జేసీ వాలీబాల్‌

13 May, 2021 13:43 IST|Sakshi
కోవిడ్‌ రోగులతో వాలీబాల్‌ ఆడుతున్న జేసీ

వారిలో ఆత్మస్థైర్యం నింపిన విజయనగరం జాయింట్‌ కలెక్టర్‌

బొబ్బిలి: కరోనా వైరస్‌ బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు విజయనగరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌ ముందడుగు వేశారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు వెళ్లి వారితో కలిసి ఆటలాడి వారిలో ఆందోళన పోగొట్టారు. ఆయన బుధవారం బొబ్బిలి గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలోని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను పరిశీలించారు. అక్కడున్న 123 మంది కరోనా వైరస్‌ బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

వారు చెప్పిన చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి అక్కడే ఉన్న తహసీల్దార్‌ ఆర్‌.సాయికృష్ణ, సీఎస్‌డీటీ బలివాడ గౌరీశంకర్‌లకు ఆదేశాలిచ్చారు. కరోనా వల్ల ఏం కాదని, జాగ్రత్తలు మాత్రం ముఖ్యమని చెబుతూ బాధితులతో కలిసి వాలీబాల్‌ ఆడారు. బాల్‌ సరిగా వెయ్‌.. అంటూ వారిని ఉత్సాహపరిచారు.  దీంతో కోవిడ్‌ బాధితులు కూడా ఉత్సాహంగా ఆయనతో ఆడారు. రోజూ మూడు షిఫ్ట్‌ల్లో వైద్యులు, సిబ్బంది ఉండాలని, త్వరితగతిన రికవరీ అయ్యేలా వారిలో ధైర్యాన్ని నూరిపోయాలని జేసీ అధికారులకు సూచించారు.

చదవండి: ‘జగనన్న ప్రాణవాయువు’ రథచక్రాలు ప్రారంభం
ఆత్మ బంధువులు: మానవత్వమే ‘చివరి తోడు’ 

 

మరిన్ని వార్తలు