Vizianagaram: అభాగ్యుల ఆకలి తీర్చుతున్న ఫుడ్‌బ్యాంకులు

12 Jan, 2023 19:47 IST|Sakshi

నిరంతరాయంగా అన్నసంతర్పణ

దాతల సాయంతో సాగుతున్న బృహత్తర కార్యక్రమం

రోజూ రుచికరమైన భోజనం వడ్డింపు  

అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఆకలితో అలమటించేవారికి పట్టెడన్నం పెడితే వారిలో కలిగే సంతోషం వెలకట్టలేనిది. విజయనగరం పట్టణంలో ఏడాదిన్నరగా వేలాదిమంది పేదల ఆకలితీర్చే బృహత్‌క్రతువు నిరాటంకంగా కొనసాగుతోంది. స్వచ్ఛంద సంస్థలు, దాతలు, నాయకులు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు, ఉద్యోగులు, హోటళ్ల నిర్వాహకులు ఇలా.. మనసున్న ప్రతి ఒక్కరూ ఫుడ్‌బ్యాంకుల నిర్వహణను భుజానకెత్తుకున్నారు. నిర్భాగ్యులకు రుచికరమైన భోజనం వడ్డిస్తున్నారు. వృథాగా పారబోసే ప్రతి మెతుకుతో మరొకరి ఆకలి తీర్చాలన్న ప్రధాన ఆశయంతో ముందుకు సాగుతున్నారు.      
– పైడి చిన్నఅప్పలనాయుడు, విజయనగరం డెస్క్‌
ఫొటోలు: డి.సత్యనారాయణమూర్తి, సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం 


విజయనగరం పట్టణానికి వచ్చిన పేదలు... స్థానికంగా ఉంటున్న అభాగ్యులు, అనాథల ఆకలి తీర్చాలన్న ఆశయం నుంచి ఏర్పడినవే ఫుడ్‌ బ్యాంకులు. జిల్లా కేంద్రానికి ఏ దారిలో వచ్చిన వారికైనా ఫుడ్‌బ్యాంకులు తారసపడతాయి. ప్రస్తుతం నలువైపులా నాలుగు ఫుడ్‌ బ్యాంకులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలైతే చాలు... ఇక్కడ భోజనాల వడ్డింపు కార్యక్రమం ఆరంభమవుతుంది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు నిరాటంకంగా కొనసాగుతుంది. వివిధ పనులపై వచ్చేవారు, కూలీలు, ఆటోడ్రైవర్లు, యాచకులు, అనాథలు, వృద్ధులు ఇలా.. అన్నం కోసం ఎదురుచూసేవారందరికీ ఫుడ్‌బ్యాంకులు అన్నంకుండలా మారుతున్నాయి. వారి ఆకలి తీర్చుతున్నాయి. ఒక్కో ఫుడ్‌బ్యాంకులో రోజుకు 100 నుంచి 150 మందికి భోజనం వడ్డిస్తున్నారు. నడవలేని, లేవలేని కొందరు వృద్ధులకు క్యారేజీలతో అందిస్తున్నారు. వీటి నిర్వహణలో స్వచ్ఛంద సంస్థలు, ఆలయాలు, హోటళ్ల నిర్వాహకులు, నాయకులు, యువత, కార్పొరేషన్‌ ఉద్యోగులు భాగస్వాములయ్యారు.   

ఏ శుభ, అశుభ కార్యమైనా...  
ఇంటిలో ఎలాంటి శుభ, అశుభ కార్యం జరిగినా పేదలకు అన్నం పెట్టాలనుకునేవారు ఫుడ్‌బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. వారి స్థాయిని బట్టి అన్నదానం చేస్తున్నారు. కొందరు నాలుగు ఫుడ్‌బ్యాంకులలో ఒక రోజు వడ్డించేందుకు సరిపడా ఆహారపదార్థాలను సరఫరా చేస్తుండగా, మరికొందరు ఒక ఫుడ్‌బ్యాంకుకు సరిపడా ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. పేదలకు స్వయంగా వడ్డించి, వారి ఆకలితీర్చి ఆత్మ సంతృప్తిపొందుతున్నారు. ప్రస్తుతం విజయనగరంతో పాటు పరిసర గ్రామాల్లో పుట్టినరోజులు, జయంతి, వివాహాది శుభకార్యాలు, పండగల సమయంలో ముందుగా ఫుడ్‌ బ్యాంకులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. అందుకే... అన్నదాన ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. దాతల సాయంబట్టి రాత్రి పూట కూడా భోజనం వడ్డిస్తున్నామని పేర్కొంటున్నారు.   


ఫుడ్‌ బ్యాంకుల నిర్వహణ ఇలా...
 
► ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదురుగా ఉన్న ఫుడ్‌బ్యాంకు దాతలతో పాటు కన్యకాపరమేశ్వరి ఆలయం సహకారంతో కొనసాగుతోంది.    
► కోటకూడలిలోని ఫుడ్‌బ్యాంకు హోటళ్ల నిర్వాహకులు, దాతలు సాయంతో సాగుతోంది.  
► ఎన్‌సీఎస్‌ థియేటర్‌ ఎదురుగా ఉన్న అన్నదాన కేంద్రం దాతలు, కార్పొరేషన్, గౌరీ సేవాసంఘం సహకారంతో నడుస్తోంది.  
► పోలీస్‌ బ్యారెక్స్‌ వద్ద ఉన్న కేంద్రం దాతలు, కార్పొరేషన్, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ ఆధ్వర్యంలో కొనసాగుతోంది.  

వడ్డించే పదార్థాలు  
అన్నం, సాంబారు, ఒక కూర, పులిహోర, చక్రపొంగలి (దాతలు సమకూర్చితే అరటిపండు, స్వీటు, ఇతర పదార్థాలు)   

ఫుడ్‌బ్యాంకులలో అన్నదానం ఇలా...  
► ప్రతిరోజు ఒక ఫుడ్‌బ్యాంకులో 100 నుంచి 150 మంది చొప్పున నాలుగు ఫుడ్‌బ్యాంకులలో 400 నుంచి 600 మందికి భోజనం వడ్డిస్తున్నారు.  
► ఈ ప్రక్రియ ఆగస్టు 13, 2021 నుంచి నిరంతరాయంగా సాగుతోంది. నెలకు 12,000 నుంచి 18,000 మంది ఆకలిని ఫుడ్‌బ్యాంకులు తీర్చుతున్నాయి. కోట వద్ద ఉన్న ఫుడ్‌ బ్యాంకులో రాత్రి సమయంలో కూడా అన్నదానం చేస్తుండగా, మిగిలిన చోట్ల దాతల సాయం బట్టి రాత్రిపూట భోజనం వడ్డిస్తున్నారు.  

పేదవాని ఆకలి తీర్చడమే ధ్యేయం 
పేదవాడి ఆకలి తీర్చాలని, సామాన్యులకు మేలు చేయాలన్న మంచి సంకల్పంతో ప్రారంభించినవే ఫుడ్‌ బ్యాంకులు. విజయనగరంలో ఏర్పాటుచేసిన 4 ఫుడ్‌బ్యాంక్‌లు పేదలు, అనాథల ఆకలి తీర్చుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో అన్నా క్యాంటీన్‌ల పేరుతో రూ.5కే భోజనం పెట్టించామని గొప్పలు చెప్పుకునేవారు. తప్పుడు లెక్కలతో ఖజానా ఖాళీచేసేవారు. ఇప్పుడు కార్పొరేషన్‌ పరిధిలో నిర్వహిస్తున్న ఫుడ్‌బ్యాంకులకు దాతలే సహకరిస్తూ వేలాదిమంది కడుపునింపుతున్నారు. త్వరలో కొత్తపేట నీళ్ల ట్యాంకు వద్ద మరో ఫుడ్‌బ్యాంక్‌ ఏర్పాటు చేస్తాం.  
– కోలగట్ల వీరభద్రస్వామి, శాసనసభ డిప్యూటీ స్పీకర్, విజయనగరం ఎమ్మెల్యే

మంచి కార్యక్రమం 
ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలైతే చాలు.. అన్నం కోసం చాలామంది పేదలు ఇక్కడకు వస్తారు. దాతలు సమకూర్చిన అన్నం వృథా కాకుండా వడ్డిస్తున్నాం. కొన్నిసార్లు సంఖ్య పెరిగితే అప్పటికప్పుడు స్థానిక కార్పొరేటర్లు, దాతలు సహకరించి ఆహారపదార్థాలు సమకూర్చుతున్నారు. వివాహాది శుభకార్యాల సమయంలో మిగిలిన ఆహారపదార్థాలను అందిస్తే రాత్రి సమయంలోనూ పేదలకు వడ్డిస్తున్నాం. 
– రమణమూర్తి, ఫుడ్‌బ్యాంకు సూపర్‌వైజర్‌ 

మిగిలిపోయిన ఆహారం వృథా కాకుండా...  
వివాహాలు, వేడుకలు, విందుల సమయంలో మిగిలిపోయిన ఆహారపదార్థాలను ఫుడ్‌ బ్యాంకులకు చేర్చుతున్నారు. వీటిని ఫుడ్‌బ్యాంకులలో ఉన్న ఫ్రిజ్‌లలో నిర్వాహకులు భద్రపరుస్తున్నారు. పేదల కడుపు నింపుతున్నారు.  

దాతల భాగస్వామ్యంతో..  
విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఫుడ్‌ బ్యాంక్‌లు ఏర్పాటు చేశాం. వాటి ద్వారా ప్రతిరోజు వందలాది మంది నిరుపేదల ఆకలి తీరుస్తున్నాం. ఈ ప్రక్రియంలో దాతల భాగస్వామ్యం శుభపరిణామం. జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం ప్రతి రోజు వేలాది మంది వచ్చిపోతుంటారు. అందులో చాలా మంది ఆర్థిక స్థోమత లేక ఆకలితో ఇంటికి వెళ్తుంటారు. అటువంటి వారికి  ఫుడ్‌బ్యాంక్‌ల సేవలు ఉపయుక్తంగా మారాయి. ప్రతి రోజు రుచి, శుచితో కూడిన భోజానాన్ని అందించగలుగుతున్నాం.  
– రెడ్డి శ్రీరాములనాయుడు, కమిషనర్, విజయనగరం కార్పొరేషన్‌ 

ఆనందంగా ఉంది  
ఫుడ్‌బ్యాంకుల నిర్వహణ నిరాటంకంగా సాగుతోంది. ఉద్యోగిగా ఫుడ్‌బ్యాంకు నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నా... ఆకలితో వచ్చే పేదలకు వడ్డించడంలో ఉన్న ఆనందమే వేరు. అన్నదానం చేసిన దాతలకు చేతులెత్తిదండం పెట్టాలి. వారి దయవల్లే పేదల ఆకలి తీరుతోంది. ఫుడ్‌బ్యాంకుల నిర్వహణ ఆలోచన గొప్పది.  
– జె.రవితేజ, ఫుడ్‌బ్యాంకు సూపర్‌వైజర్‌ 

క్యారేజీ అవసరంలేదు..  
విజయనగరం పట్టణానికి చెట్లు కొట్టేందుకు వస్తాను. పట్టణ పరిధిలో ఎక్కడ పని ఉన్నా క్యారేజీ తెచ్చుకోను. ఫుడ్‌ బ్యాంకు వద్దకు వచ్చి భోజనం చేస్తాను. మా లాంటి కూలిపనివారికి కడుపునిండా భోజనం పెడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది.  
– రీసు పైడితల్లి, గొట్లాం 

ఆకలితీర్చుతోందయ్యా..  
నేను కాగితాలు, ప్లాస్టిక్‌ కవర్లు ఏరుతూ జీవిస్తున్నాను. ఎక్కడ ఉన్నా పోలీస్‌ బ్యారెక్‌ వద్ద ఉన్న ఫుడ్‌బ్యాంకు వద్దకు సమయానికి చేరుకుంటాను. కడుపునిండా భోజనం చేస్తున్నారు. మాలాంటి పేదలకు అన్నంపెడుతున్న దాతలు నూరేళ్లపాటు చల్లగా ఉండాలి.  
– రాముపైడమ్మ, గాజులరేగ, విజయనగరం 

మంచి కార్యక్రమం 
ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలైతే చాలు.. అన్నం కోసం చాలామంది పేదలు ఇక్కడకు వస్తారు. దాతలు సమకూర్చిన అన్నం వృథా కాకుండా వడ్డిస్తున్నాం. కొన్నిసార్లు సంఖ్య పెరిగితే అప్పటికప్పుడు స్థానిక కార్పొరేటర్లు, దాతలు సహకరించి ఆహారపదార్థాలు సమకూర్చుతున్నారు. వివాహాది శుభకార్యాల సమయంలో మిగిలిన ఆహారపదార్థాలను అందిస్తే రాత్రి సమయంలోనూ పేదలకు వడ్డిస్తున్నాం. 
– రమణమూర్తి, ఫుడ్‌బ్యాంకు సూపర్‌వైజర్‌

మరిన్ని వార్తలు