Vizianagaram: గంటస్తంభానికి కొత్త సొబగులు

1 Oct, 2022 20:38 IST|Sakshi

రూ.25 లక్షలతో పూర్తయిన ఆధునికీకరణ పనులు

వచ్చేనెల 5న మంత్రి బొత్స చేతుల మీదుగా ప్రారంభోత్సవం

పనుల ప్రగతిని పరిశీలించిన డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి 

విజయనగరం: చారిత్రక నేపథ్యం కలిగిన విజయనగరం గంటస్తంభం కొత్త సొబగులు అద్దుకుంటోంది. సుమారు రెండు శతాబ్దాల కిందట నగరం నడిబొడ్డున నిర్మించిన గంటస్తంభం... ఆధునీకరణ పనులతో మరింత ఆకర్షణీయంగా దర్శనమివ్వనుంది. డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో జరుగుతున్న ఆధునీకరణ పనులు తుదిదశకు చేరుకోగా... వచ్చే నెల 5న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు. పనుల ప్రగతిని డిప్యూటీ స్పీకర్‌ క్షేత్రస్థాయిలో శుక్రవారం పరిశీలించారు.  

గంట స్తంభం చరిత ఇది...  
 25 అడుగుల కైవారం, రూ.4,680 వ్యయంతో 8 కుంభుజాలతో 18వ శతాబ్దంలో గంటస్తంభాన్ని నిర్మించారు. గంటస్తంభానికి నలువైపులా నాలుగు పెద్ద గడియారాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు,  మధ్యాహ్నం 12, రాత్రి 8 గంటలకు పెద్ద శబ్దంతో అలారం మోగేది. కాలక్రమేణా గంటస్తంభం చెక్కు చెదరనప్పటికీ దానికి అమర్చిన గడియారాలు పాడైనప్పుడు సాంకేతిక నిపుణులను రప్పించి మరమ్మతు చేయించేవారు. ప్రస్తుతం వాటి స్థానంలో అధునాతన గడియారాలు ఏర్పాటు చేయడంతో పాటు కట్టడంలో ఉన్న కిటికీలను మార్పు చేశారు. అలనాటి వైభవం దెబ్బతినకుండా కట్టడానికి పుట్టీపెట్టించి నూతనంగా రంగులతో కొత్త సొబగులు అద్దారు. గంటస్తంభం చుట్టూరా విద్యుత్‌ దీపాలంకరణతో వాటర్‌ ఫౌంటౌన్‌ నిర్మించారు. ఈ పనులతో రాత్రి వేళ చూసేవారికి ఆకర్షణీయంగా కనిపించనుంది. మొత్తం ఆధునీకరణ పనులను దాతల సహకారంతో చేపట్టగా.. రూ.25 నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు చేసినట్టు అంచనా.  


పనులను పరిశీలించిన కోలగట్ల...  

గంటస్తంభం ఆధునికీకరణ పనులను అధికారులతో కలిసి కోలగ్ల వీరభద్రస్వామి పరిశీలించారు. త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. గంటస్తంభం చుట్టూ కలియతిరిగి ఆక్రమణల తొలగింపుపై టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు తగుసూచనలిచ్చారు. విజయనగర వైశిష్ట్యం ప్రతిబింబించేలా అలరారుతున్న గంటస్తంభాన్ని ఆధునీకరించి మరింత ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే పూర్తయిన పనులతో మరింత శోభాయమానంగా అలరారబోతోందని  చెప్పారు. నగరాన్ని  కార్పొరేషన్‌ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ప్రధాన కూడళ్లను ఇప్పటికే అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. కార్యక్రమంలో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కేదారశెట్టి సీతారామమూర్తి, 4వ డివిజన్‌ కార్పొరేటర్‌ మరోజు శ్రీనివాసరావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ కార్యదర్శి కాళ్ల సూరిబాబు, ఏసీపీ మధుసూదన్‌రావు, డీఈ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు