10 నెలల్లో 185 మంది శిశువులు గర్భంలోనే కన్నుమూత.. ఆ రెండు ఆస్పత్రుల్లోనే!

3 Mar, 2022 18:43 IST|Sakshi

ఆడ పిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందన్న రోజుల నుంచి ఆడపిల్లలను గర్భంలోనే చిదిమేసిన రోజులకు మానవ సమాజం  దిగజారింది. మానవ శాస్త్ర విజ్ఞాన అభివృద్ధి ఇందుకేనా.. అన్నట్టు తలదించుకునేలా చోటు చేసుకుంటున్న సంఘటనలు నివ్వెరపరుస్తున్నాయి. మరోవైపు వివాహేతర సంబంధాల నేపథ్యంలో గర్భంలోనే ఆడ.. మగ అనే తేడా లేకుండా జరుగుతున్న శిశు హత్యలు గుండెలను పిండేస్తున్నాయి. కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇదేనా మన విజ్ఞానాభివృద్ధి అనేలా ప్రశ్నిస్తున్నాయి.

సాక్షి, విజయనగరం ఫోర్ట్‌: వైద్య రంగం అభివృద్ధి చెందక ముందు పుట్టే బిడ్డ ఆడ.. మగ అని మాత్రమే చూసేవారు. ఒక్కో మహిళ పది మంది పిల్లలకు జన్మనిచ్చేది. ఏ బిడ్డయినా సమానంగానే పెంచేవారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఇలా సంతోషాలు వెల్లివిరిసేవి. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పుట్టే బిడ్డ ఆడ.. మగ అనేది అమ్మ గర్భంలోనే స్కానింగ్‌ చేసి గుర్తిస్తున్నారు. అంగ వైకల్యాలను సైతం గర్భంలోనే పసిగట్టేస్తున్నారు. ఇంకేముంది ఆడ బిడ్డయితే గర్భంలోనే చిదిమేస్తున్న సంఘటనలు వైద్య రంగాన్ని సవాల్‌ చేస్తున్నాయి. వివాహేతర సంబంధాలు కూడా ఇటువంటి పరిస్థితులకు దారి తీస్తున్నాయి. వివాహేతర సంబంధాల విషయంలో అది ఆడ.. మగ.. అని చూడకుండా భ్రూణహత్యలకు దిగజారుతున్నారు.

వైద్య రంగ విప్లవం మానవ అభివృద్ధికి దోహదపడేలా తప్ప ఇలా తల్లి గర్భంలోనే భ్రూణ హత్యలకు దారితీయడం దారుణం. నింగిలో సగం.. నేలపై సగం అంటూ మహిళలు అన్ని రంగాల్లో నేడు రాణిస్తున్నారు. అవకాశాలు దక్కితే తమ సత్తా చూపుతున్నారు. అయినా ఆడ పిల్లల పట్ల ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడ పిల్లను ఎంతగా చదివించినా... వారు ఎంతగా రాణించినా పెళ్లి సమయంలో వరకట్న దురాచారం ఇంకా పీడిస్తూనే ఉంది. దీని ఫలితం ఆడ పిల్లలను వద్దనుకునే వారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో ఆడ పిల్లలను కోరుకునే వారు ఉన్నారు.  
చదవండి: చిన్న వయసులోనే గుండెపోటు ముప్పు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పది నెలల్లోనే... 
2021 ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జనవరి నెల వరకు 185 మంది  గర్భంలోనే చనిపోయారు. వీరిలో 12 వారాల్లోపు చనిపోయిన వారు 135 మంది కాగా, 12 నుంచి 20 వారాల్లోపు చనిపోయిన వారు 50 మంది ఉన్నారు. ఈ మరణాల్లో గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలుసుకుని కొందరు తల్లిదండ్రులు అబార్షన్లు చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

స్కానింగ్‌ సెంటర్లపై కొరవడిన పర్యవేక్షణ  
స్కానింగ్‌ సెంటర్లపై పర్యవేక్షణ కొరవడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం భ్రూణ హత్యల నివారణకు ప్రత్యేక చట్టం తెచ్చి అమలు చేస్తున్నా... కొందరు నిర్వాహకులు అమ్యామ్యాలకు అలవాటుపడి లింగ నిర్ధారణ వెల్లడిస్తున్నారనే విమర్శలున్నాయి. కొన్నేళ్లుగా స్కానింగ్‌ కేంద్రాలపై ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఈ ఆరోపణలకు ఊతమిస్తుంది.  

ఆ రెండు ఆస్పత్రుల్లోనే... 
జిల్లా కేంద్రంలోని రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో అబార్షన్లు ఎక్కువగా జరుగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాసులకు కక్కుర్తి పడి అబార్షన్లు చేస్తున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. ఈ విషయం సంబంధిత ఆస్పత్రులపై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లిందని తెలిసింది. ఇదే సమయంలో అబార్షన్‌ కోసం తీసుకువచ్చే ఆర్‌ఎంపీ, ఆశ వర్కర్లకు ఆయా ఆస్పత్రులు భారీగా ఆఫర్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది.
చదవండి: Health Tips: బరువు తగ్గాలని బ్రేక్‌ఫాస్ట్‌ మానేస్తే.. కష్టమే! 

తగ్గుతున్న ఆడ పిల్లల సంఖ్య 
జిల్లాలో ఆడ పిల్లల సంఖ్య నెలనెలా తగ్గిపోతుంది. వెయ్యి మంది బాలురుకు 940 మంది బాలికలే ఉన్నారు. 2021 డిసెంబరులో వెయ్యి మంది బాలురుకు 942 మంది బాలికలు ఉన్నారు. 2022 జనవరి నెల వచ్చేసరికి ఆ సంఖ్య 940కి తగ్గింది.  

స్కానింగ్‌ చేయాల్సిన పరిస్థితులు   
►  జన్యు సంబంధమైన జీవ కణాల్లో కలిగే అసాధ«రణ మార్పు గుర్తించినప్పుడు  
 ►  ఎర్ర రక్తకణాల్లో అసాధారణ స్థితి ఉన్నప్పుడు. 
►   లింగ సంబంధిత  వ్యాధులు గుర్తించినప్పుడు. 
 ►  స్కానింగ్‌కు చట్టం ఆమోదించే  పరిస్థితులు.  
►   గర్భదారణ జన్యు సంబంధమైన పిండానికి వ్యాధులు కనుగొనేందుకు అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ చేస్తారు. 
►   గర్భిణికి రెండు, అంతకన్నా ఎక్కువ సార్లు  గర్భస్రావం, పిండ నష్టం జరిగినప్పుడు.  
►   గర్భిణులు హానికారక మందులు, అణుధార్మిక శక్తి, రసాయనాల బారిన పడినప్పుడు, దాని ప్రభావం  కలిగినప్పుడు  స్కానింగ్‌ చేయవచ్చు.  

సమాచారమిస్తే చర్యలు 
జిల్లాలో ఏ స్కానింగ్‌ సెంటర్‌లోనైనా లింగ నిర్ధారణ చేస్తున్నట్టు సమాచారం ఇస్తే తనిఖీలు చేసి తీవ్రమైన చర్యలు చేపడతాం. అటువంటి స్కానింగ్‌ సెంటర్‌ను సీజ్‌ చేయడంతో పాటు క్రిమినల్‌ కేసు పెడతాం. లింగ నిర్ధారణ వెల్లడి చట్టరీత్యా నేరమనే విషయమై అవగాహన కల్పిస్తున్నాం. అదే సమయంలో వివాహం కాకుండా గర్భం దాలుస్తున్న వారు అబార్షన్లు చేయించుకుంటున్నట్టు మా దృష్టికి వచ్చింది.   
– డాక్టర్‌  ఎస్‌వీ రమణకుమారి, డీఎంహెచ్‌ఓ  

మరిన్ని వార్తలు