400 కిలోమీటర్లు.. రూ.568 కోట్లు.. మూడు జిల్లాలను కలుపుతూ జాతీయరహదారి

14 Jan, 2023 19:31 IST|Sakshi
రంపచోడవరం మండలం ఐ.పోలవరం వద్ద జాతీయ రహదారి రోడ్డు నిర్మాణ పనులు

రాజమహేంద్రవరం– విజయనగరం వరకు మూడు జిల్లాలను కలుపుతూ చేపట్టిన జాతీయ రహదారి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 400 కిలోమీటర్ల పొడవునా చేపట్టే ఈ నిర్మాణానికి రూ.568 కోట్లను కేంద్ర ప్రభుత్వం వెచ్చించింది.  

సాక్షి, అల్లూరి సీతారామరాజు(రంపచోడవరం): మూడు జిల్లాలను కలుపుతూ చేపట్టిన రాజమహేంద్రవరం– విజయనగరం హైవే రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 400 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.568 కోట్లు వెచ్చించింది. దశల వారీగా నేషనల్‌ హైవే ఆథారిటీ అధికారులు చేపట్టిన పనులు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే గోకవరం నుంచి ఐ.పోలవరం జంక్షన్‌ వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం పూర్తయింది.  

నాలుగు మండలాల పరిధిలో.. 
రంపచోడవరం మండలం  ఐ.పోలవరం నుంచి కాకరపాడు వరకు జాతీయ రహదారి 516 రోడ్డు పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి నాలుగు మండలాలను కలుపుతూ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. పది కిలోమీటర్లు మేర రోడ్డును విస్తరిస్తున్నాయి. ఈ నాలుగు మండలాల్లో  హైవే రోడ్డు నిర్మాణానికి 725 ఎకరాలు అవసరం.  

585 ఎకరాలు అప్పగింత 
ఇప్పటివరకు 585 ఎకరాల ప్రభుత్వ భూమిని రోడ్డు నిర్మాణ పనులకు ఇంజినీరింగ్‌ అధికారులకు అప్పగించారు. మరో 140 ఎకరాలు ప్రైవేట్‌ భూమి ఉంది. ఈ భూమిని అప్పగించేందుకు అవార్డు ఎంక్వైయిరీ ప్రకటించిన తరువాత, భూ యాజమానులకు నష్టపరిహారం చెల్లించి భూమిని అప్పగిస్తారు. అయితే అప్పటి వరకు రోడ్డు నిర్మాణ పనులు చేసుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు లేవని అధికారవర్గాలు తెలిపాయి. సుమారు 70 కిలోమీటర్లు మేర నిర్మిస్తున్న రోడ్డు మార్గంలో 120 చోట్ల కల్వర్టులు, వంతెనలు నిర్మాణం చేపడతారు. 

రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు.. 
హైవే రోడ్డు నిర్మాణం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం నుంచి గోకవరం, పోక్సుపేట, ఐ. పోలవరం జంక్షన్, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, కాకరపాడు జంక్షన్, కృష్ణదేవిపేట, చింతపల్లి, లంబసింగి, పాడేరు, అరకు మీదుగా విజయనగరం వరకు రోడ్డు నిర్మాణం జరుగుతుంది. మినిస్ట్రీస్‌ ఆఫ్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్టు అండ్‌ నేషనల్‌ హైవే ఆథారిటీ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 

చురుగ్గా పనులు 
సుమారు 70 కిలోమీటర్లు మేర రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పాత రోడ్డును వెడల్పు చేసే పనులు పూర్తవుతున్నాయి. ప్రస్తుతం పనులకు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రైవేట్‌ భూములను అప్పగించే ప్రక్రియ పూర్తయితే రోడ్డు నిర్మాణ పనులకు ఎటువంటి ఇబ్బందులు లేవు. 
– చక్రవర్తి, జేఈ, ఆర్‌అండ్‌బీ, కాకినాడ  

మరిన్ని వార్తలు