అయ్యో మనీషా! కానరాని దేశంలో అవస్థలు.. చార్జీల కోసం వాట్సాప్‌ వీడియో విడుదల

1 Aug, 2022 14:37 IST|Sakshi

తెర్లాం (విజయనగరం): విదేశాల్లో ఉద్యోగం, లక్షల్లో జీతం వస్తుందని ఓ ఏజెంట్‌ చెప్పిన మాయమాటలను నమ్మి మోసపోయిన ఓ వివాహిత ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. దేశం కాని దేశంలో ఉద్యోగం లేక, తినడానికి తిండిలేక అవస్థలు పడుతోంది. విజిటింగ్‌ వీసా గడువు కూడా ఈ ఆదివారంతో ముగియనుండడంతో ఏమి చేయాలో తెలియక దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించింది.

దుబాయ్‌ నుంచి వచ్చేందుకు విమాన చార్జీలు ఎవరైనా దాతలు పంపిస్తే తాను ఇండియాకు వస్తానని, తనను ఆదుకోవాలని దుబాయ్‌ నుంచి వాట్సాప్‌ వీడియోను శనివారం ఆమె పోస్ట్‌ చేసింది. వివరాలిలా ఉన్నాయి.. విజయనగరం జిల్లా, తెర్లాం గ్రామానికి చెందిన మనీషా ఉద్యోగం కోసమని కొన్నిరోజుల క్రితం దుబాయ్‌ వెళ్లింది. విశాఖపట్నానికి చెందిన ఓ ఏజెంట్‌ ఆమెతో రూ.80 వేలు కట్టించుకుని, దుబాయ్‌లో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు.

దీంతో ఆమె తన దగ్గరున్న సొమ్మునంతా ఆ ఏజెంట్‌కు ఇచ్చి, అతడి విజిటింగ్‌ వీసాతో ఆమె దుబాయ్‌ వెళ్లింది. ఇలా దుబాయ్‌కు వెళ్లిన కొద్దిరోజుల్లోనే చిన్న చిన్న ఉద్యోగాలు చూపించాడు. ఆ ఉద్యోగాలు నచ్చకపోవడంతో మంచి ఉద్యోగం చూపిస్తానని నమ్మబలికాడు. ఆ తర్వాత అతడు కొన్నాళ్లకు పరారయ్యాడు. దీంతో ఆ మహిళకు ఏమి చేయాలో, ఎక్కడకు వెళ్లాలో తెలియలేదు. ఆఖరికి దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించింది.

తాను మోసపోయిన విషయం వివరించింది. ఆమె వద్ద ఉన్న వీసాను రాయబార కార్యాలయ అధికారులు పరిశీలించగా, అది విజిటర్స్‌ వీసా అని, ఆదివారంతో గడువు ముగుస్తుందని తెలిపారు. ఇండియాకు వెళ్లేందుకు తన వద్ద ఒక్క రూపాయి కూడా లేదని, కొన్ని రోజులుగా తిండి కూడా తినలేదని, దాతలెవరైనా తనను ఇండియా తీసుకువచ్చేందుకు ఆర్థిక సాయం చేయాలని ఆమెతో ఓ వీడియో చిత్రీకరించి, దానిని వాట్పాప్‌లో పోస్ట్‌ చేసింది. ఈ విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.   

మనీషా వివరాలపై అధికారుల ఆరా.. 
మనీషా వివరాలపై విజయనగరం ఎస్‌బీ(స్పెషల్‌ బ్రాంచ్‌) అధికారులు శనివారం ఆరా తీశారు. దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎస్‌బీ అధికారులు తెర్లాం గ్రామం, మండలంలోని పలువురికి ఫోన్‌ చేసి, ఆమె వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

మరిన్ని వార్తలు