నగరానికి ‘సిరి’మాను

3 Oct, 2021 10:22 IST|Sakshi
సిరిమాను చెట్టుపై గొడ్డలివేటు వేస్తున్న ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తదితరులు 

భక్తిశ్రద్ధలతో సిరిమాను చెట్టుకు పూజలు  

తల్లి నామస్మరణతో చెట్టును తరలించిన భక్తులు  

పూజలు చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు  

సాక్షి, డెంకాడ: మేళతాళాలు.. పైడితల్లి నామస్మరణ.. దీక్షధారుల జయజయధ్వానాలు.. పసుపు నీళ్లతో మహిళా భక్తుల చల్లదనాల నడుమ నగరానికి ‘సిరి’మాను తరలింపు ప్రక్రియ శనివారం వైభవంగా సాగింది. డెంకాడ మండలంలోని డెంకాడ పంచాయతీ చందకపేట గ్రామంలోని చందకవారి కల్లాలు వద్ద సాక్షాత్కరించిన సిరిమాను చెట్టుకు ముందుగా ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 8 గంటలకు సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు గొడ్డలితో తొలివేటు వేశారు.

ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి, విజయనగరం మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి, వైఎస్సార్‌సీపీ నాయకులు అవనాపు విజయ్, విక్రమ్, ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరావు, పైడితల్లి దేవస్థానం ఈఓ కిషోర్‌కుమార్, వైస్‌ ఎంపీపీ పిన్నింటి తమ్మునాయుడు, డెంకాడ సొసైటీ అధ్యక్షుడు రొంగలి కనక సింహాచలం, నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, అధికారులు, భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సిరిమాను చెట్టుకు చెట్టుదాతలు చందక వారి కుటుంబ సభ్యులు పసుపుకుంకాలు సమర్పించారు. అనంతరం చెట్టు కొట్టే పనులు మొదలుపెట్టారు.  

నగరంలో సిరిమాను చెట్టు తరలింపు సందడి
     

అమ్మ దీవెనలు అందరిపైనా ఉండాలి..  
పైడితల్లి అమ్మవారి చల్లని దీవెనలు ప్రజలందరిపైనా ఉండాలని, కోవిడ్‌ నుంచి రక్షించాలని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆకాంక్షించారు. డెంకాడ మండలంలో సిరిమాను చెట్టును తల్లి కోరడం భాగ్యంగా భావిస్తున్నామని చెప్పారు. సంప్రదాయాలను పాటిస్తూ పైడితల్లి ఉత్సవాలు నిర్వహిస్తామని కలెక్టర్‌ సూర్యకుమారి తెలిపారు. విజయనగరం కార్పొరేషన్‌ మేయర్‌ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ ప్రజలకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని తల్లిని ప్రార్థించానన్నారు.  

మరిన్ని వార్తలు