సిగ్నల్‌ కోసమా? పవర్‌ ప్రాబ్లమా?

30 Oct, 2023 05:23 IST|Sakshi

ప్రమాద ఘటనపై పోస్ట్‌మార్టం చేస్తున్న రైల్వే శాఖ

సాక్షి, విశాఖపట్నం : 08532 విశాఖ–పలాస రైలు కంటకాపల్లి నుంచి బయలుదేరిన 10 నిమిషాలకు చినరావుపల్లి దగ్గర నిలిచిపోయింది. ఆ మార్గంలో మొత్తం మూడు లైన్లు ఉండగా.. మధ్యలైన్‌లో ఈ రైలు నిలిపారు. అయితే.. కంటకాపల్లి నుంచి దాని వెనుకే బయలుదేరిన 08504 రైలు అదే మూడో లైన్‌లోకి వచ్చేసింది.

ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్థా­రించారు. విశాఖ–పలాస రైలును మధ్య లైన్‌లో ఎందుకు నిలిపారు? ఆలమండ స్టేషన్‌ నుంచి సిగ్నల్‌ అందలేదా? లేదా ప్రమాద సమయంలో హైటెన్షన్‌ వైర్లు తెగిపడి ఉన్నాయా? ప్రమాదం జరగకముందే ఇవి తెగిపడటంవల్ల రైలు నిలిచిపోయిందా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు.. ఒక రైలు ఆగి ఉన్నప్పుడు అదే మార్గంలో మరో రైలు వెళ్లేందుకు అనుమతి ఎలా ఇచ్చారనే కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు. ఆటో సిగ్నలింగ్‌ వ్యవస్థ లోపంవల్లే వెనుక వస్తున్న రాయగడ రైలు.. మధ్య లైన్‌లోకి వచ్చినట్లు భావి స్తున్నారు.సిగ్నల్‌ లేక పలాస రైలును చినరావుపల్లెలో నిలిపినట్లయితే.. ఆ సమాచారాన్ని రాయగడ రైలుకు పంపాలి. అదీ జరగలేదు. పోనీ.. హైటెన్షన్‌ వైర్లు తెగిపడటంవల్ల నిలిచిపోయినట్ల­యితే.. ఆ సమా­చారం కూడా వెనుక వస్తున్న రైళ్లకు చేర వేయాల్సి ఉంది. ఈ రెండూ జరగకపోవడంవల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సిగ్నలింగ్‌ వ్యవస్థ లోప­మా.. మానవ తప్పిదమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఆ రైలువల్లే పెను ప్రమాదం తప్పింది..
సాధారణ రోజుల్లో ఈ 2 రైళ్లు నిరంతరం ప్రయా­ణికులతో నిండుగా ఉంటాయి. వ్యాపారులు, స్థాని­కులు, ఏదైనా పని, లేదా వైద్యం.. ఇతర అవసరాల కోసం విశాఖకి ఉదయాన్నే వచ్చి.. పనులన్నీ చూసుకుని సాయంత్రానికి తిరుగు ప్రయాణానికి ఈ రెండు రైళ్లనే ఆశ్రయిస్తుంటారు. కానీ, ఆదివారం మాత్రం.. ఈ రైళ్లలో అంతగా జనం ఉండరు.

దీనికి కారణం.. ఈ రైళ్లు బయలుదేరిన కొద్దిసేపటికే విశాఖపట్నం–విజయనగరం పాసింజర్‌ మెము రైలు (07468) ఉంటుంది. విజయనగరం వెళ్లే వాళ్లంతా శని, ఆదివారాల్లో ఈ రైలు కోసం ఎక్కువగా ఎదురుచూస్తుంటారు. ఈ రైలు లేకపోతే.. ఇందులో వెళ్లే ప్రయాణికులంతా ఈ 2 రైళ్లనే ఆశ్రయించేవాళ్లు. అప్పుడు ప్రమాద తీవ్రత మరింత పెరిగి ఉండేది.

మరిన్ని వార్తలు