అన్నార్తులకు అండగా..

23 May, 2022 05:02 IST|Sakshi
యాచకులకు అన్నం పొట్లాలను పంపిణీ చేస్తున్న వలంటీర్‌ బాలాజీ

నిర్భాగ్యుల ఆకలి తీరుస్తున్న వలంటీర్‌ బాలాజీ

370 రోజులుగా పేదలకు అన్నదానం 

సేవామిత్ర రూరల్‌ ఫౌండేషన్‌ పేరుతో సాయం  

పుత్తూరు: తాను పేద కుటుంబానికి చెందిన వాడే అయినా.. నిర్భాగ్యుల ఆకలి తీరుస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నాడు తిరుపతి జిల్లా పుత్తూరు మండలం తడుకు సచివాలయ వలంటీర్‌ బాలాజీ. వీఎస్‌ఎస్‌ పురం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన వేలాయుధం, లక్ష్మీకాంతమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు బాలాజీ. తల్లిదండ్రులు కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. బాలాజీ ఇంటర్‌ చదువుతుండగానే తండ్రి వేలాయుధం మరణించాడు.

అప్పటినుంచి తల్లి కూలి పనులు చేస్తూ కుమారుడిని డిగ్రీ వరకు చదివించింది. తల్లికి చేయూతగా ఉండాలన్న ఉద్దేశంతో బాలాజీ క్యాటరింగ్‌ పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఊళ్లోనే వలంటీర్‌గా అతడికి అవకాశం లభించింది. ఓ వైపు గ్రామస్తులకు ‘సచివాలయ’ సేవలు అందిస్తూనే.. మరోవైపు రాత్రి వేళల్లో క్యాటరింగ్‌ పనులతోపాటు వాటర్‌ ఫ్యూరిఫైయర్‌ యంత్రాల మరమ్మతులు, ఎలక్ట్రీషియన్‌గా చిన్నపాటి పనులు చేసుకుంటూ అమ్మకు ఆసరాగా నిలుస్తున్నాడు.  

ఆకలి బాధలు దూరం చేస్తూ.. 
యాచకులు.. అనాథలు.. నిరుపేదలను ఆకలి బాధలను గమనించిన బాలాజీ వారికి అందించాలన్న తపనతో ‘సేవామిత్ర రూరల్‌ ఫౌండేషన్‌’ పేరుతో గత ఏడాది మార్చిలో సేవా కార్యక్రమాలు ప్రారంభించాడు. వారికి రోజూ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందించాలని నిశ్చయించుకున్నాడు. రోజూ 30 నుంచి 40 మందికి అన్నదానం చేస్తూ వచ్చాడు. అలా ప్రారంభమైన ఈ యజ్ఞం నేటికి 370 రోజులకు పైగా నిరాటంకంగా కొనసాగుతోంది.

అలాగే కరోనా కాలంలో గొల్లపల్లె, వీఎస్‌ఎస్‌ పురం, టీఆర్‌ కండ్రిగ, తడుకు ప్రాంతాల్లోని నిరుపేద గిరిజన కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, వంట సామగ్రిని అందించాడు. బాలాజీ ప్రతినెలా తనకు అందే గౌరవ వేతనం రూ.5 వేలను సేవా కార్యక్రమాలకే వెచ్చిస్తున్నాడు. గత ఏడాది ప్రభుత్వం వలంటీర్ల సేవలకు కానుకగా సేవామిత్ర అవార్డుతో పాటు అందించిన రూ.10 వేలను, ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం అందించిన రూ.10 వేలు సైతం సేవా కార్యక్రమాలకే వినియోగించాడు. అతడి సేవలు స్థానికంగా అందరి మన్ననలు అందుకుంటున్నాయి. 

ఆకలి చావును ప్రత్యక్షంగా చూశా 
నిరుపేద కుటుంబంలో పుట్టాను. పేదరికం చూశాను. అమ్మ కష్టాన్ని అర్థం చేసుకున్నాను. అన్నం కోసం కల్యాణ మండపాల వద్ద ఎగబడే వారిని చూశాను. తిరుచానూరులో ఆకలి చావు చూశాను. అప్పుడే పదిమందికీ సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. అమ్మను పోషించుకుంటునే రోజూ నా సాయం కోసం ఎదురు చూసే 30 నుంచి 40 మంది యాచకులకు అన్నం పొట్లాలు అందిస్తున్నాను.  
– బాలాజీ, వలంటీర్, వీఎస్‌ఎస్‌ పురం, తడుకు పంచాయతీ 

మరిన్ని వార్తలు