టీకాతో వలంటీర్ లలిత‌ మృతి 

8 Feb, 2021 03:05 IST|Sakshi

ఈ నెల ఐదో తేదీన వలంటీర్‌కు వ్యాక్సిన్‌ 

అప్పటి నుంచి జ్వరం, తలనొప్పి

టీకా వికటించడం వల్లే తమ బిడ్డ చనిపోయిందంటున్న కుటుంబ సభ్యులు

శ్రీకాకుళం జిల్లా పలాసలో ఘటన

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వలంటీర్‌ పిల్లా లలిత(28) ఆదివారం మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటలో ఈ ఘటన జరిగింది. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే మృతికి కారణాలను నిర్ధారించగలమని తహసీల్దార్‌ చెప్పారు. లలితతో పాటు వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.  

సాక్షి, పలాస/కాశీబుగ్గ : కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వలంటీర్‌ పిల్లా లలిత(28) ఆదివారం మృతి చెందారు. వ్యాక్సిన్‌ వికటించడం వల్లే తమ బిడ్డ మృతి చెందిందని తల్లిదండ్రులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటకు చెందిన లలితతో పాటు మరో 8 మంది వలంటీర్లు, వీఆర్వో ప్రసాద్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అప్పటి నుంచి అందరికీ స్వల్పంగా జ్వరం, తలనొప్పి లక్షణాలు కనిపించాయి. లలితకు ఆ లక్షణాలు తీవ్రంగా ఉండటంతో ఇంట్లోనే ఉంటూ టాబ్లెట్లు వేసుకున్నారు. ఈ క్రమంలో తెల్లవారుజామున మృతి చెందారు.

మృతురాలికి భర్తతో పాటు ఎనిమిదేళ్ల కుమారుడున్నాడు. పలాస తహసీల్దార్‌ మధుసూదనరావు, కాశీబుగ్గ సీఐ శంకరరావు, డీఎంహెచ్‌వో చంద్రనాయక్‌ తదితరులు లలిత మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే మృతికి గల కారణాలను నిర్ధారించగలమని తహసీల్దార్‌ చెప్పారు. లలిత మృతిచెందడంతో ఆమెతో పాటు వ్యాక్సిన్‌ తీసుకున్న మిగతా వలంటీర్లు, వీఆర్వో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారు పలాస పీహెచ్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. 

మృతురాలి కుటుంబానికి మంత్రి భరోసా
ఇదిలా ఉండగా వలంటీర్‌ మృతి వార్త తెలుసుకున్న మంత్రి సీదిరి అప్పలరాజు పలాస కమ్యూనిటీ ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అక్కడే తక్షణ సాయం కింద రూ.2 లక్షలు ప్రకటించారు. 

అప్పటికే నీరసించిపోయింది..
టీకా వేసుకున్న తర్వాత జ్వరం వచ్చిందని చెప్పింది. మెడికల్‌ సిబ్బందికి తెలియజేస్తే పారాసిటమాల్‌ వేసుకోవాలని చెప్పారు. అయితే లక్షణాలు అలాగే ఉంటాయిలే అనుకుని టాబ్లెట్‌ కూడా వేసుకోలేదు. తర్వాత రోజు కూడా జ్వరం తగ్గకపోవడంతో టాబ్లెట్‌ వేశాం. కానీ అప్పటికే పూర్తిగా నీరసం అయిపోయింది. తెల్లారేసరికి ఇలా జరిగింది. మా పాపకు ఎలాంటి ఆరోగ్య సమస్యల్లేవు. కేవలం వ్యాక్సిన్‌ వేసుకోవడం వల్లే చనిపోయింది.  – పి.పార్వతి, మృతి చెందిన వలంటీర్‌ తల్లి 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు