పింఛన్‌ డబ్బు కోసం వలంటీర్‌ కట్టు కథ 

2 Oct, 2020 07:51 IST|Sakshi
దాడిలో గాయపడ్డానంటూ ఆస్పత్రిలో చేరిన వలంటీర్‌ వీరప్ప

దాడి చేసి నగదు దోచుకెళ్లారని అబద్ధాలు 

రికవరీ చేస్తామంటున్న పోలీసులు 

వలంటీర్‌ను తొలగించిన కలెక్టర్‌ 

సాక్షి, మడకశిర: ‘వైఎస్సార్‌ పింఛన్‌’ డబ్బు కోసం కట్టుకథ అల్లాడు ఓ వలంటీర్‌. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి రూ.43,500 దోచుకెళ్లారంటూ అందరినీ నమ్మించే యత్నం చేశాడు. వివరాల్లోకెళితే... పట్టణంలోని 3వ వార్డుకు చెందిన శివాపురం  పరిధిలో వార్డు వలంటీర్‌గా  వీరప్ప పని చేస్తున్నారు. గురువారం 1వ తేదీ కావడంతో లబి్ధదారులకు పింఛన్‌ పంపిణీ చేయడానికి తెల్లవారు జామున  4.30 గంటలకే సిద్ధమయ్యాడు.

శివాపురం కాలనీ పరిధిలోని కొండ ప్రాంతంలో ఉన్న లబ్ధిదారులకు పింఛన్‌ పంపిణీ చేయడానికి దాదాపు రూ.43,500  జేబులో పెట్టుకుని ఇంటి నుండి బయలుదేరాడు. అయితే ఆ డబ్బును ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశంతో కట్టుకథను అల్లాడు. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో పాటు కళ్లలో కారంకొట్టి రూ.43,500 దోచుకెళ్లారని స్థానికులను నమ్మించే యత్నం చేశాడు. నిజమేననుకొని స్థానికులు వలంటీర్‌ను చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు.  (మడకశిరలో దోపిడీ దొంగల బీభత్సం)

విచారణలో తేలిన నిజం 
విషయం తెలియగానే స్థానిక సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్‌ఐ రాజేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ నాగార్జున సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వీరప్పను వారు విచారించగా డబ్బు కోసమే కట్టు కథ అల్లాడని తేల్చారు. అతనిపై ఎలాంటి దాడి జరగలేదన్నారు. రూ.43,500 ను వలంటీర్‌ నుండి రికవరీ చేస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ నాగార్జున తెలిపారు. 

విధుల నుంచి తొలగింపు 
మడకశిరరూరల్‌: శివాపురం సచివాలయ పరిధిలోని వలంటీర్‌ వీరప్పను జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు విధుల నుంచి తొలగించాలని కమిషనర్‌ నాగార్జునకు ఉత్తర్వులు జారీ చేశారు. పింఛన్‌ సొమ్ము రూ.43,500 అపహరణ వ్యవహారంలో వలంటీర్‌ అసత్యాలు, కట్టు కథ అల్లినట్లు విచారణలో తేలడంతో అతన్ని విధుల నుంచి తొలగించాలని కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  

మరిన్ని వార్తలు