ప్రతీ ఆర్బీకేలో ఓ వలంటీర్‌

12 Sep, 2022 03:53 IST|Sakshi

రైతులకు నిరంతర సేవల కోసం ఏర్పాటు

సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు

ఆర్బీకే కార్యకలాపాలపై ఈ వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ.. ఈనెల 20 నుంచి అందుబాటులోకి వారి సేవలు

సాక్షి, అమరావతి: గ్రామస్థాయిలో అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం మరింత నాణ్యమైన సేవలను అందించనుంది. ఇందుకోసం ప్రతీ ఆర్బీకేకు ప్రత్యేకంగా ఒక వలంటీర్‌ను నియమిస్తోంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీచేసింది. గ్రామాల్లో చురుగ్గా పనిచేసే వలంటీర్లను ఎంపికచేసి వారికి ఆర్బీకే కార్యకలాపాలపై ప్రత్యేక శిక్షణనిచ్చి ఈ నెల 20 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు  ఏర్పాట్లుచేస్తోంది. సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం 10,778 ఆర్బీకేలను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలను వీటి ద్వారా గ్రామస్థాయిలోనే అందిస్తోంది. 

ఆర్బీకేల్లో 14,435 మంది సేవలు
ప్రతీ ఆర్బీకేకు ఒక వ్యవసాయ, దాని అనుబంధ శాఖలకు సంబంధించిన సహాయకులను నియమించింది. వీటిల్లో ప్రస్తుతం 14,435 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. వీరిలో 6,321 మంది గ్రామ వ్యవసాయ, 2,356 మంది ఉద్యాన, 4,652 మంది పశుసంవర్థక, 731 మంది మత్స్య, 375 మంది పట్టు సహాయకులు ఉన్నారు. వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా సాగు విస్తీర్ణం, రైతుల సంఖ్యను బట్టి ప్రతీ ఆర్బీకేలో ఒక వ్యవసాయ, ఉద్యాన, మత్స్య సహాయకుల్లో ఒకరు ఇన్‌చార్జిగా ఉంటారు. స్థానికంగా ఉన్న పాడి, పట్టు విస్తీర్ణాన్ని బట్టి ఆయా సహాయకులు కూడా సేవలు అందిస్తున్నారు. ఇలా మెజార్టీ ఆర్బీకేల్లో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతీ ఆర్బీకేకు ఒక బ్యాంకింగ్‌ కరస్పాండెం ట్‌ను కూడా అనుసంధానించారు.

సిబ్బందిలేని వేళ ఇబ్బంది లేకుండా..
సాధారణంగా ప్రతిరోజు ఉ.7 నుంచి 9 గంటల వరకు, తిరిగి సా.3 నుంచి 6 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. మిగిలిన సమయాల్లో పంటల నమోదు (ఈ–క్రాప్‌)తో పాటు రైతులకు అందించే వివిధ రకాల సేవల కోసం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తుంటారు. దీంతో ఆయా సమయాల్లో సిబ్బంది అందుబాటులో లేక ఆర్బీకేలకు వచ్చే రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది.

ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆర్బీకేలు తెరిచి ఉంచడమే కాదు.. రైతులు ఎప్పుడు ఏ అవసరం కోసం వచ్చినా ఎవరో ఒకరు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ప్రతీ ఆర్బీకేకు ఓ వలంటీర్‌ను అనుసంధానం చేయాలని నిర్ణయించింది. గత నెలలో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆర్బీకేకి ఒకరు చొప్పున వలంటీర్లను అనుసంధానం చేస్తూ గ్రామ, వార్డు సచివాలయాల విభాగం డైరెక్టర్‌ సగిలి షాన్‌మోహన్‌ ఉత్తర్వులు జారీచేశారు. వ్యవసాయ శాఖ అభ్యర్థన మేరకు గ్రామాల్లో చురుగ్గా పనిచేస్తూ సేవాతత్పరత కలిగిన వలంటీర్‌ను ఎంపిక చేయాలన్నారు.

ఆర్బీకే కార్యకలాపాలపై ప్రత్యేక శిక్షణ
ఎంపికైన వలంటీర్లకు మండల వ్యవసాయ శాఖాధికారులు, జిల్లా రిసోర్స్‌ సెంటర్‌ సిబ్బంది ద్వారా ఆర్బీకే కార్యకలాపాలపై శిక్షణ ఇస్తారు. సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు ఆర్బీకేలకు వచ్చే రైతులతో మర్యాదగా నడుచుకోవడం, వారికి అవసరమైన ఇన్‌పుట్స్‌ను కియోస్క్‌ ద్వారా బుక్‌ చేయించడం, గోడౌన్ల నుంచి వచ్చే ఇన్‌పుట్స్‌ను తీసుకుని స్టాక్‌ రిజిస్టర్‌లో నమోదు చేయడం, సాగు సలహాలకు సంబంధించిన వీడియోలను రైతులకు స్మార్ట్‌ టీవీల్లో ప్రదర్శించడం, ఇతర సేవలపై తర్ఫీదు ఇస్తారు.

నిరంతర సేవలే లక్ష్యంగా..
అన్నదాతలు ఎప్పుడు ఏ అవసరం కోసం వచ్చినా ఆర్బీకేలు తెరిచే ఉండాలి. సిబ్బంది లేని పక్షంలో ఎవరో ఒకరు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల  మేరకు ప్రతి ఆర్బీకేకు ఒక గ్రామ వలంటీర్‌ను అనుసంధానం చేస్తున్నాం. వారికి ఆర్బీకే కార్యకలాపాలపై ప్రత్యేక శిక్షణను ఇవ్వనున్నాం. ఈ నెల 20 నుంచి వారి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
– వి.శ్రీధర్, జాయింట్‌ డైరెక్టర్‌ (అగ్రికల్చర్‌), ఆర్బీకేల ఇన్‌చార్జి 

మరిన్ని వార్తలు