వలంటీర్‌ వ్యవస్థ పనితీరు బాగుంది

28 Oct, 2020 03:42 IST|Sakshi
వలంటీర్లతో మాట్లాడుతున్న ఆరిజ్‌ అహ్మద్‌

అసోం ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆరిజ్‌ అహ్మద్‌

వ్యవస్థ పనితీరుపై అసోం రాష్ట్రానికి నివేదిక

పొదిలి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అమలు చేస్తున్న గ్రామ, వార్డు వలంటీర్‌ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు బాగున్నాయని అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ షేక్‌ ఆరిజ్‌అహ్మద్‌ అన్నారు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా పొదిలికి వచ్చిన సందర్భంగా మంగళవారం పట్టణంలోని వలంటీర్లు, సచివాలయానికి సంబంధించిన వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, మహిళా పోలీసులతో ముఖాముఖి మాట్లాడారు. పంచాయతీ డీఈ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

వలంటీర్ల విధుల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయశాఖ, విద్య, వైద్య రంగాలకు సంబంధించి ఎటువంటి సేవలు అందిస్తున్నారని ఆరా తీశారు. వలంటీర్ల అర్హతలు, ఎంపిక విధానం ఎలా జరిగింది, సచివాలయం ఉద్యోగులైన వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, మహిళా పోలీసుల విధులు, నిర్వహణ తీరును గురించి అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులకు వెంటనే లబ్ధి చేకూర్చేలా తాము విధులు నిర్వహిస్తున్నట్లు వలంటీర్లు వివరించారు. ఆరిజ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ అసోం రాష్ట్రానికి ఈ వ్యవస్థ పనితీరును గురించి సవివరంగా రిపోర్ట్‌ అందచేయనున్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు