సాటిలేని సేవ.. పోటీలేని గెలుపు

6 Feb, 2021 05:36 IST|Sakshi
సర్పంచ్‌గా ఎన్నికైనట్లు ఆర్వో నుంచి పత్రాన్ని అందుకుంటున్న సరస్వతి

50 ఇళ్లను మెప్పించి గ్రామాన్నే గెలిచిన వలంటీర్‌ 

కొల్లావారిపాలెంలో ఏకగ్రీవంగా సర్పంచ్‌ అయిన వలంటీర్‌

ఠంఛనుగా పింఛన్‌ పంచినప్పుడు ఆమె నిబద్ధతను గుర్తించారు.. ప్రభుత్వ పథకమేదైనా అర్హుల చెంతకు చేర్చడంలో ఆమె చూపిన చొరవ గమనించారు. నలుగురినీ ఆప్యాయంగా పలకరించడంలో ఆమె కలుపుగోలుతనాన్ని తెలుసుకున్నారు. 50 ఇళ్లకు వలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఆ కుటుంబాల్లో సభ్యురాలిగా మారిన ఆమె మంచితనానికి ఏకగ్రీవంగా ఓటు వేశారు. కొల్లావారిపాలెంలో వలంటీర్‌ సరస్వతిని ఊరంతా ఒక్కమాట మీద నిలబడి సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. జిల్లాలో వలంటీర్ల సేవలకు ఆ గ్రామ ప్రజలు పెద్ద బహుమతి ఇచ్చి పట్టం కట్టారు. 

పర్చూరు: ప్రకాశం జిల్లా పర్చూరు మండలం కొల్లావారిపాలెం గ్రామంలో 300 కుటుంబాలున్నాయి. సుమారు 1,200 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ 755 మంది ఓటర్లు (పురుషులు 362 మంది, మహిళలు 393 మంది) ఉన్నారు. ఈ పంచాయతీ ఏర్పాటై సుమారు 53 సంవత్సరాలైంది. ఇక్కడ మొదటి నుంచి టీడీపీ ఆధిక్యం కనబరిచేది. 2019 లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను కేటాయించి ఆయా గృహాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో వలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా మారారు. కోవిడ్‌ సమయంలోనూ వీరు అమూల్యమైన సేవలు అందించారు.

కొల్లావారిపాలెంలో 2వ క్లస్టర్‌లో కొల్లా సరస్వతికి వలంటీర్‌ పోస్టు ఇచ్చారు. ఆమె 2019 ఆగస్టు 15 నుంచి వలంటీరుగా విధులు నిర్వర్తించడం ప్రారంభమైంది. ఈమె బీటెక్‌ వరకు చదువుకుంది. మొదటి నుంచి ప్రభుత్వ పథకాలు తన పరిధిలోని వారికి అందించడంలో ప్రత్యేక చొరవ చూపించేది. అధికారుల వద్ద నిబద్ధతతో వ్యవహరించి మన్ననలు పొందింది. ఈ పంచాయతీ సర్పంచ్‌ పదవిని జనరల్‌ మహిళకు కేటాయించారు. దీంతో వలంటీర్‌గా పనిచేస్తున్న సరస్వతి పేరు ప్రస్తావనలోకి వచ్చింది. ఆమె సేవాభావాన్ని తెలుసుకున్న గ్రామమంతా మద్దతుగా నిలిచింది. దీంతో ఆమె ఏకగ్రీవంగా సర్పంచ్‌ అయింది 

గ్రామాభివృద్ధికి కృషిచేస్తా 
కొల్లావారిపాలెం గ్రామాభివృద్దికి కృషిచేస్తా. గ్రామస్తులందరూ ఒకేతాటిపైకి వచ్చి నన్ను సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలలోకి తీసుకెళతా. గ్రామ సమస్యలపై నాకు అవగాహన ఉంది. వీటి పరిష్కారానికి కృషిచేస్తా.     
– కొల్లా సరస్వతి 

సరస్వతి సేవలు అభినందనీయం 
కొల్లా సరస్వతి వలంటీర్‌గా తనకు కేటాయించిన 50 ఇళ్లకు తిరిగి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది. వలంటీర్‌గా ఉన్నప్పుడు అందరి సమస్యల పరిష్కారానికి కృషిచేసేది. ఇప్పుడు గ్రామంలో అందరం కలిసి ఆమెనే సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాం.     
– అనురాధ, గ్రామస్తురాలు 

ఐకమత్యంతో అభివృద్ధి 
పంచాయతీల్లోని గ్రామాల అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు నజరానా ప్రకటించడం సంతోషంగా ఉంది. ఐకమత్యంతో పంచాయతీని ఎంతో అభివృద్ది చెందుతుంది.      
    – సంపత్‌కుమార్, మాజీ సర్పంచి  

మరిన్ని వార్తలు