వ్యవసాయానికి వలంటీర్లు

7 Nov, 2022 10:03 IST|Sakshi

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ విశిష్ట సేవలందిస్తున్న వలంటీర్లు ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలకూ (ఆర్బీకే) అనుబంధంగా పని చేయనున్నారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్‌  జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి ఆర్బీకేకు ఒక వలంటీరును ఏర్పాటు చేస్తున్నారు. సీఎం చొరవతో ఇక రైతు భరోసా కేంద్రాల్లో నిరంతర సేవలు అందే అవకాశం ఏర్పడింది. వలంటీర్ల రాకతో ఆర్బీకేలు రైతులకు మరింత చేరువకానున్నాయి. 

పొదిలి రూరల్‌(ప్రకాశం జిల్లా): రైతు దేశానికి వెన్నెముక. రైతు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న భావనతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారికి అడుగడుగునా అండగా నిలుస్తూ వ్యవసాయానికి కావాల్సిన అన్ని రకాల సేవలను అందిస్తూ ఆదుకుంటున్నారు. ప్రభుత్వ సేవలు ప్రతీ ఇంటికీ అందేలా నియమించిన వలంటీర్లు ఇప్పుడు అన్నదాతకు కూడా సేవలందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పంట దిగుబడులు వచ్చాక విక్రయానికి ఇబ్బందులు పడుతున్న రైతుల అవస్థలను గుర్తించి ధాన్యం కొనుగోలులో వలంటీర్ల సేవలను వినియోగించుకోనేలా ప్రణాళికలు తయారు చేసింది.

ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.  రైతులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రతి ఆర్బీకేకు ఒక వలంటీరును ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ పంటల సాగు ఆధారంగా విలేజీ అగ్రికల్చర్‌ అసిస్టెంట్, విలేజి హార్టీకల్చర్‌ అసిస్టెంట్, విలేజి సెరీకల్చర్‌ అసిస్టెంట్‌ పని చేస్తున్నారు. వీరే ఆర్బీకే ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. అయితే వీరంతా ఎక్కువ సమయాన్ని క్షేత్ర స్థాయిలో గడపాల్సి వస్తుంది.

ప్రధానంగా పంటల సాగు సమయంలో ఈ క్రాప్‌ బుకింగ్‌ ప్రక్రియ కోసం రోజుల తరబడి పంట పొలాల్లో ఉండాల్సి వస్తుంది. దీంతోపాటు వారంలో ఒక రోజు పొలంబడి కార్యక్రమం నిర్వహించాలి. వీటితో పాటు మండల, సబ్‌డివిజన్, జిల్లా స్థాయిలో నిర్వహించే సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలకు హాజరు కావాలి. ఇలాంటి సమయాల్లో రైతు భరోసా కేంద్రాలను మూసి వేయాల్సి వస్తుంది. దీంతో రైతులు అత్యవసర సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అలాంటి పరిస్థితిలో వ్యయప్రయాసలతో మండల, నియోజకవర్గ కేంద్రాలకు పరుగులు తీయాలి. ఈ సమస్యను గుర్తించి సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి మరో అడుగు ముందుకేసి రైతులకు ఈ సమస్య కూడా ఉండకూడదని భావించి సమస్య పరిష్కారానికి ప్రతి ఆర్బీకేకు ఒక వలంటీరును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

వలంటీర్ల ఎంపిక
జిల్లాలో మొత్తం 616 రైతు భరోసా కేంద్రాలున్నాయి. వాటిలో గ్రామీణ ప్రాంతాల్లో 597 ఉండగా, అర్బన్‌ ప్రాంతంలో 19 ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి 597 మంది, అర్బన్‌ ప్రాంతంలో 9 మంది వలంటీర్లను ఆర్బీకేలకు ఎంపిక చేశారు. మిగిలిన 10 మంది వలంటీర్లను ఒంగోలు 9, కనిగిరి 1 నియమించాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో అదికూడా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ప్రతి ఆర్బీకేకు ఇంటరు (బయాలజీ) చదివిన వ్యక్తిని వలంటీర్లుగా ఎంపీడీవో నియమించారు. వలంటీర్లకు ఆర్బీకేల నిర్వహణపై, రైతుల నుంచి ధాన్యం కొనుగోలుపై శిక్షణ కూడా ఇచ్చారు. విత్తనాల పంపిణీ, డిజిటల్‌ కియోస్క్‌ ద్వారా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులకు ఆర్డర్‌ పెట్టడం, పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు ఆర్బీకే ఇన్‌చార్జ్‌ల పర్యవేక్షణలో వలంటీర్లు చేపడతారు. వలంటీర్లు నేరుగా రైతు వద్దనే ధాన్యం సేకరించి వారికి మద్దతు ధర అందించేలా చర్యలు తీసుకుంటారు.  

దేశానికే రోల్‌మోడల్‌గా ఆర్బీకేలు
గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కావడంతో రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. విత్తన ఎంపిక నుంచి పంట విక్రయం వరకు అన్ని సేవలు ఊర్లోనే ఆర్బీకేల ద్వారానే అందుతున్నాయి. దీంతో అవి దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచాయి. తాజాగా ఆర్బీకేకు ఒక వలంటీరును నియమించడంతో మరో విప్లవాత్మక మార్పు చోటుచేసుకుంది. గతంలో ప్రైవేటు డీలర్లు రసాయనిక ఎరువులను అడ్డగోలుగా అధిక ధరలకు విక్రయించే వారు. ఎంఆర్‌పీపై రూ.50 నుంచి రూ.100 వరకు ఎక్కువగా వసూలు చేసేవారు. ఆర్బీకేలు ఏర్పాటు కావడంతో ప్రైవేటు డీలర్ల అక్రమాలు చాలా వరకు అదుపులోకి వచ్చాయి. తాజాగా వలంటీర్ల నియామకంతో మరింత మెరుగైన సేవలు రైతులకు అందుతాయి.  

శుభ పరిణామం  
ప్రతి ఆర్బీకేకు వలంటీర్‌ను నియమించడం శుభపరిణామం. దీంతో సేవలు మరింత చేరువవుతాయి. అప్పటికే ఆర్బీకేల ద్వారా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు పొందుతున్నాం. ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు అందుబాటులో ఉంచడం మంచి నిర్ణయం. వ్యవసాయ అధికారులు రైతుల పొలాలకు వచ్చి పంటలను చూసి సూచనలు, సలహాలు ఇవ్వడంతో రైతులకు మేలు జరుగుతుంది.  
– బీరం కృష్ణారెడ్డి, గురుగుపాడు, రైతు 

గొప్ప ఆలోచన  
రైతుల మేలు కోసం ఆర్బీకేకు ఒక వలంటీరును నియమించడం సీఎం జగన్‌ మంచి ఆలోచన. విలేజీ అసిస్టెంట్లు ఏదైనా పనుల నిమిత్తం బయటకు పోతే రైతులు ఇబ్బందులు పడుతారేమోనని సమస్యను ముందుగానే గుర్తించి ఆర్బీకేకు ఒక వలంటీర్‌ను నియమించడం మంచి నిర్ణయం. రైతుల సమస్యలను గుర్తించి వలంటీర్‌ను నియమించినందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.  
– వెంకటేశ్వర్లు, రైతు, మాదాలవారిపాలెం 

వలంటీర్లకు సమగ్ర శిక్షణ 
జిల్లాలో మొత్తం 616 రైతు భరోసా కేంద్రాలున్నాయి. వాటిలో గ్రామీణ, అర్బన్‌ ప్రాంతాల్లో ఉన్న ఆర్బీకేలకు 606 మంది వలంటీర్ల నియామకం పూర్తయింది. అర్బన్‌ ప్రాంతంలో ఉన్న ఆర్బీకేలకు ఇంకా 10 మంది వలంటీర్ల నియామకం పూర్తి కాలేదు. వాటిని త్వరగా పూర్తి చేస్తాం. నియామకం పూర్తైన వలంటీర్లకు ఆర్బీకేల నిర్వహణపై సమగ్ర శిక్షణ కూడా ఇస్తారు. ఆర్బీకే ఇన్‌చార్జ్‌లు క్షేత్ర స్థాయిలో వెళ్లిన సమయాల్లో రైతులకు వీరే అన్ని సేవలు అందించాల్సి ఉంటుంది.  
– ఎస్‌ శ్రీనివాసరావు, జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్, ఒంగోలు 

ఆర్బీకేలో శాఖల వారీగా అందుతున్న సేవల సంఖ్య
వ్యవసాయ శాఖ: 28 
ఏపీఎంఐపీ: 05 
మత్స్యశాఖ: 09 
ఉద్యానశాఖ: 06 
పశుసంవర్ధక శాఖ: 11 
పట్టు పరిశ్రమ శాఖ: 08

మరిన్ని వార్తలు