రామోజీ తప్పుడు రాతలు మానుకో

13 Dec, 2022 09:09 IST|Sakshi

‘ఈనాడు’ నిరాధార వార్తలపై వలంటీర్ల నిరసన హోరు

అసత్య కథనాలపై ఆగ్రహ జ్వాలలు

రామోజీరావు దిష్టిబొమ్మ దహనం

దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా):  గ్రామ వలంటీర్లపై అసత్య కథనాలను ప్రచురించిన రామోజీరావు... ఇకనైనా తప్పుడు రాతలు మానుకోవాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వలంటీర్లు హెచ్చరించారు. తమపై ‘ఈనాడు’లో వచ్చిన తప్పుడు రాతలను నిరసిస్తూ గ్రామ సచివాలయ వలంటీర్లు అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో సోమవారం భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిరాధార వార్తలతో తమ మనోభావాలు దెబ్బతీయడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. గౌరవ పారితోషికంతో గ్రామాల్లో నిస్వార్థంగా సేవలందిస్తున్న తమను కించపరిచేలా రాతలు రాయడం వెనుక ఆంతర్యమేమిటంటూ తీవ్రంగా మండిపడ్డారు.

స్వార్థ రాజకీయాల కోసం తమ జీవితాలతో చెలగాటం ఆడొద్దంటూ ధ్వజమెత్తారు. ముందుగా ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు రామోజీరావు దిష్టిబొమ్మతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద మాన­వ­హారంగా ఏర్పడి ‘వలంటీర్లపై తప్పుడు రాతలు మానుకోవాలి, వలంటీర్ల మనోభావాలను దెబ్బతీస్తే సహించబోం, రామోజీరావు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ఈనాడు డౌన్‌ డౌన్, రామోజీరావు డౌన్‌ డౌన్‌’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం రామోజీరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు వలంటీర్లు మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ సేవాభావంతో సేవలందిస్తున్న తమను కించపరచడం తగదన్నారు. వలంటీర్‌ వ్యవస్థ ఇతర రాష్ట్రాల ప్రశంసలు అందుకోవడం వాస్తవం కాదా... అని ప్రశ్నించారు.  ప్రజా మన్ననలు పొందుతున్న తమను కించపరిచేలా ఇలాంటి అవాస్తవ కథనాలు ప్రచురిస్తే సహించబోమని వలంటీర్లు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు