ఓట్‌ ఫ్రమ్‌ హోం 

21 Jan, 2024 05:38 IST|Sakshi

80 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులకు వెసులుబాటు

పోలింగ్‌ కేంద్రానికి వెళ్లలేని వారికి అవకాశం కల్పించిన ఎన్నికల సంఘం

ఇప్పటికే పలు రాష్ట్రాల ఎన్నికల్లో విజయవంతంగా అమలు

ఇప్పుడు ఏపీలోనూ అమలుకు చర్యలు  

సాక్షి, నరసరావుపేట: చేతికర్ర సాయంతో ఓ ది­వ్యాంగుడు.. ఆటోలో ఓ ముసలవ్వ.. ఇలా అనేక మంది ఎన్నికల కేంద్రాలకు వచ్చి ఓటు వేసేందుకు పడే తిప్పలు గతంలో కనిపించేవి. కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి వారి కష్టాలకు చెక్‌ పెట్టింది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40%కి మించి వైకల్యం ఉన్న వారు ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ విధానాన్ని సీఈసీ ఇప్పటికే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతంగా అమలు చేసింది. ఇప్పుడు ఏపీలోనూ అమలుకు చర్యలు చేపట్టింది.

పోస్టల్‌ బ్యాలెట్‌ తరహాలోనే.. ఇంటి నుంచి ఓటు వేయడానికి కూడా ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 80 ఏళ్ల పైబడి వయసు ఉన్నవారు, దివ్యాంగులు ఎన్నికల నోటిఫికేషన్‌ రావడానికి ఐదు రోజుల ముందే 12డీ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వీటిని ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలు పరిశీలిస్తాయి. అర్హులైన వారికే ‘ఓట్‌ ఫ్రమ్‌ హోం’కు అవకాశం కల్పిస్తాయి. బూత్‌ లెవల్‌ అధికారి కూడా ఇంటి నుంచే ఓటు వేయడానికి అర్హులైన వారిని సంప్రదించి.. వారి ఆసక్తికి అనుగుణంగా దరఖాస్తు చేయిస్తారు. 

పోలింగ్‌ బూత్‌ తరహా ఏర్పాట్లు 
ఇంటి నుంచే ఓటు వేసే కార్యక్రమానికి కూడా సాధారణంగా పోలింగ్‌ కేంద్రంలో మాదిరిగానే జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్‌ చేస్తారు. ఓటు ఎవరికి వేశారో బయటకు రాదు. పోలింగ్‌ సిబ్బందితో పాటు ఆయా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా వారి వెంట ఉంటారు. ఇంటి నుంచి ఓటు వేయటానికి ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు, ఎంత మందికి ఓటు హక్కు కల్పించారనే వివరాలను అన్ని రాజకీయ పార్టీలతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా ఎన్నికల సిబ్బంది సమాచారమిస్తారు. వయో వృద్ధులు, దివ్యాంగులు ఈ సదుపాయాన్ని సది్వనియోగం చేసుకోవాలని ఎన్నికల అధికారులు కోరారు. 

మంచి అవకాశం... 
80 ఏళ్లు నిం.డిన మా లాంటి వారు పోలింగ్‌ బూత్‌కు వెళ్లి ఓటు వేయాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని గుర్తించి ఎన్నికల సంఘం ఇంటి వద్ద నుంచే ఓటు వేయడానికి అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. దీని వల్ల ఓటింగ్‌ శాతం కూడా పెరిగే అవకాశముంది.   – యెన్నం వెంకట నర్సిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌. ఉప్పలపాడు, పల్నాడు జిల్లా 

విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం 
పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లలేక కొంతమంది తమ విలువైన ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. దీనిని సరిచేసేందుకు ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది. ఈ విధానం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయవంతమైంది. మన రాష్ట్రంలో అమలు చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విధానాన్ని అర్హులైన వారు వినియోగించుకునేలా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. – ఎల్‌ శివశంకర్, పల్నాడు జిల్లా కలెక్టర్‌ 

>
మరిన్ని వార్తలు