మానవత్వం చూపించిన వీఆర్వో

14 Apr, 2021 17:09 IST|Sakshi

సాక్షి, నందిగాం: కరోనా భయంతో ఓ వ్యక్తి అంత్యక్రియలకు గ్రామస్తులంతా భయపడుతుంటే.. ఆ ఊరి వీఆర్వో మాత్రం అంతా తానై వ్యవహరించి మానవత్వం చాటుకున్నారు. నందిగాం మండలం సైలాడ గ్రామానికి చెందిన అట్టాడ వైకుంఠరావు(67) వారం రోజులుగా లివర్‌ సంబంధిత వ్యాధితో బాధపడుతూ శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో విశాఖ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమ వారం రాత్రి వైకుంఠరావు మృతి చెందారు.

మృతదేహాన్ని కుటుంబసభ్యులు మంగళవారం గ్రామానికి తీసుకువచ్చారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో స్థానికులు అంత్యక్రియలకు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న స్థానిక వీఆర్వో పేరాడ యుగంధర్‌ మృతుని కుటుంబసభ్యులతో పాటు బంధువులు, గ్రామస్తులతో మాట్లాడి అవగాహన కల్పించారు. కరోనా రక్షణ చర్యలు చేపట్టి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించారు. కర్రలను సమకూర్చి స్వయంగా తాను కూడా శ్మశానం వద్దకు వెళ్లారు. వీఆర్వో యుగంధర్‌ చూపిన చొరవను పలువురు ప్రశంసించారు. 

చదవండి: వీఆర్వోలకు కొత్త బాధ్యతలు..

మరిన్ని వార్తలు