డ్రెడ్జింగ్, వైబ్రో కాంపక్షన్‌కు ఓకే!

27 Apr, 2022 05:14 IST|Sakshi

పోలవరం ప్రధాన డ్యామ్‌ వద్ద గోతుల పూడ్చివేతపై వీఎస్‌ రాజు బృందం

పురుషోత్తపట్నం వద్ద గోదావరిలో డ్రెడ్జింగ్‌

గోతుల్లోకి ఇసుక పంపింగ్‌.. వైబ్రో కాంపక్షన్‌తో పటిష్టీకరణ

ఈ విధానానికి సీడబ్ల్యూసీ సూత్రప్రాయ ఆమోదం

నెలాఖరులో డీడీఆర్పీ సమావేశంలో ఆమోదం!

త్వరితగతిన ప్రాజెక్టు పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్‌ వద్ద గోదావరి వరద ఉద్ధృతికి కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే విధానాన్ని ఢిల్లీ–ఐఐటీ రిటైర్డ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వీఎస్‌ రాజు నేతృత్వంలోని నిపుణుల కమిటీ కొలిక్కి తెచ్చింది. ప్రధాన డ్యామ్‌కు 6 కిలోమీటర్ల దిగువన పురుషోత్తపట్నం వద్ద గోదావరిలో ఇసుక దిబ్బలను డ్రెడ్జింగ్‌ చేసి.. ప్రత్యేక పైపులైన్‌ ద్వారా కోతకు గురైన ప్రాంతంలో పొరలు పొరలుగా ఇసుకను పంపింగ్‌ చేసి, వైబ్రో కాంపక్షన్‌ చేయడం ద్వారా పటిష్టం చేయాలని కమిటీ నిర్ణయించింది. దీనిపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కు ఈనెల 28న నివేదిక ఇవ్వనున్నారు. ఈ నెలాఖరులో నిర్వహించే డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌ (డీడీఆర్పీ) సమావేశంలో దీనిని ఆమోదించనున్నారు. ఈ విధానం ద్వారా కోతకు గురైన ప్రాంతాన్ని వేగంగా çపూడ్చి.. ప్రధాన డ్యామ్‌ పనులు చేపట్టి, ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

గోదావరి వరదను మళ్లించే స్పిల్‌ వేను పూర్తి చేయకుండానే టీడీపీ సర్కారు కాఫర్‌ డ్యామ్‌లు, ప్రధాన డ్యామ్‌(ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌–) పునాది డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణాన్ని చేపట్టి మధ్యలోనే వదిలేసింది. దీంతో కాఫర్‌ డ్యామ్‌ల ఖాళీ ప్రదేశాల గుండా గోదావరి వరద ప్రవహించడంతో.. ఆ ఉద్ధృతికి ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–1లో 280 మీటర్ల పొడవున కోతకు గురై 12 మీటర్ల లోతుతో పెద్ద గొయ్యి ఏర్పడింది. గ్యాప్‌–2లో 300 మీటర్లు, 425 మీటర్ల పొడవున 12 మీటర్ల లోతుతో మరో రెండు పెద్ద గోతులు ఏర్పడ్డాయి. వీటిని పూడ్చే విధానంపై ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్‌ రమణ, తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్‌ జానకిరామ్, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు 2020 నుంచే అధ్యయనం చేస్తున్నారు. డ్రెడ్జింగ్‌ చేస్తూ.. కోతకు గురైన ప్రాంతంలో ఇసుకను పంపింగ్‌ చేసి.. వైబ్రో కాంపక్షన్‌ చేయాలని ప్రతిపాదిస్తున్నారు.

ఈ విధానాన్ని డీడీఆర్పీ, సీడబ్ల్యూసీలు వ్యతిరేకించాయి. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల మధ్య నీటిని తోడివేసి కోతకు గురైన ప్రాంతంలో ఇసుకను పోస్తూ.. వైబ్రో కాంపక్షన్‌ చేయాలని ప్రతిపాదిస్తున్నాయి. కానీ నీటిని తోడటానికి రూ.2,100 కోట్లకుపైగా ఖర్చవుతుంది. పైగా అత్యంత శ్రమతో కూడినది. ఇలా నీటిని తోడకుండానే డ్రెడ్జింగ్‌ ద్వారా గోతులు పూడ్చవచ్చునని ఈనెల 13న నిర్వహించిన సమావేశంలో ఢిల్లీ, తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్లు వివరించారు. దాంతో ఆ విధానానికి సీడబ్ల్యూసీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. క్షేత్ర స్థాయిలో పరిశీలించి, గోతులు పూడ్చడానికి విధి విధానాలు రూపొందించాలని ఢిల్లీ ఐఐటీ రిటైర్డు డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వీఎస్‌ రాజు నేతృత్వంలోని 8 మంది సభ్యుల నిపుణుల బృందానికి సూచించింది. ప్రొఫెసర్‌ రాజు బృందం గత గురువారం, శుక్రవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించింది. నీటిని తోడకుండానే కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చేందుకు విధి విధానాలు రూపొందించింది. ప్రధాన డ్యామ్‌ పునాది డయాఫ్రమ్‌ వాల్‌ పటిష్టతను పరీక్షించింది. కోతకు గురైన ప్రాంతంలో దానికి సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించి పాత దానితో అనుసంధానం చేయడంపై కూడా అధ్యయనం చేసింది.  

మరిన్ని వార్తలు