30 వేల ఎకరాల వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతం 

26 Aug, 2022 04:35 IST|Sakshi
మాట్లాడుతున్న ఖాదర్‌బాషా, హాఫీజ్‌ఖాన్‌

వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణే లక్ష్యం   

బోర్డు చైర్మన్‌ ఖాదర్‌బాషా వెల్లడి 

వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): ఏపీలో వక్ఫ్‌బోర్డుకు 65 వేల ఎకరాల భూములున్నాయని, వాటిలో దాదాపు 30 వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని ఏపీ వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ ఖాదర్‌బాషా చెప్పారు. వాటిని పరిరక్షించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఏపీలో వక్ఫ్‌ ఆస్తులు, భూముల పరిరక్షణే  ప్రభుత్వ లక్ష్యమని, అందుకు తమ పాలకవర్గం కృషిచేస్తోందన్నారు. విజయవాడలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. బుధ, గురువారాల్లో విజయవాడలో జరిగిన బోర్డు సమావేశంలో 150 అంశాలను చర్చించినట్లు తెలిపారు.

వక్ఫ్‌ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో పరిశీలిస్తున్నామని, అందుకోసం పెండింగ్‌లో ఉన్న 220 కమిటీలు వేశామని చెప్పారు. దర్గా (దౌలత్‌)లకు సంబంధించి ఈ 2 రోజుల్లో 200 కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వక్ఫ్‌ భూముల్లో సుమారు వందవరకు కమర్షియల్‌ ఆస్తులు ఉన్నాయన్నారు. వాటినుంచి వక్ఫ్‌బోర్డుకు ఆదాయాన్ని మరింత పెంచేందుకు తన అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సీఎం కమిటీ ఏర్పాటు చేశారన్నారు.

వక్ఫ్‌ కేసులకు సంబంధించి కర్నూలులో ట్రిబ్యునల్‌ ఏర్పాటవుతోందన్నారు. కర్నూలు ఎమ్మెల్యే, వక్ఫ్‌బోర్డు సభ్యుడు హాఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న తెలంగాణ బీజేపీ నేత రాజాసింగ్‌ని కఠినంగా శిక్షించాలన్నారు. 

మరిన్ని వార్తలు