కర్నూలులో వక్ఫ్‌ ట్రిబ్యునల్‌

29 Aug, 2021 03:39 IST|Sakshi

తుది అంకానికి చేరిన కసరత్తు

వక్ఫ్‌ భూముల వివాదాలకు వేగంగా పరిష్కారం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు కసరత్తు తుది అంకానికి చేరింది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ను కూడా అక్కడే ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. వక్ఫ్‌ భూముల పరిరక్షణకు నడుం కట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తోంది. ఇందుకోసం వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టింది.

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉన్న వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ నుంచి ఏపీకి వాటాగా రావాల్సిన సిబ్బందిని కేటాయించాలని కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో హైదరాబాద్‌ ట్రిబ్యునల్‌లో పనిచేస్తున్నవారిలో తెలంగాణకు 60 శాతం, ఏపీకి 40 శాతం చొప్పున కేటాయిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ మరో 15 రోజుల్లో కొలిక్కి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తయితే జిల్లా జడ్జిని న్యాయాధికారి (ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌)గా నియమించడం ద్వారా ట్రిబ్యునల్‌ ఏర్పాటు ప్రక్రియ పూర్తి కానుంది. ఇదంతా పూర్తి కావడానికి నెల నుంచి రెండు నెలలు పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. 

వక్ఫ్‌ భూముల వివాదాలకు త్వరితగతిన పరిష్కారం..
వక్ఫ్‌ భూములు, వాటి వివాదాలను త్వరితగతిన విచారించి పరిష్కరించడంలో ట్రిబ్యునల్‌ కీలకపాత్ర పోషిస్తుంది. అయితే రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు కాలేదు. చంద్రబాబు తన పాలనలో ఈ అంశంపై పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఫలితంగా హైదరాబాద్‌లోని వక్ఫ్‌ ట్రిబ్యునల్‌కే ఏపీ కేసులనూ పంపిస్తున్నారు. అయితే అక్కడ విచారణ వేగంగా జరగడం లేదు. ఫలితంగా ఏపీకి చెందిన వక్ఫ్‌ భూముల కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ఇలా దాదాపు 400 నుంచి 450 కేసుల వరకు పెండింగ్‌లో ఉన్నట్టు అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి పెండింగ్‌ కేసులను పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఇందుకు అవసరమైన చర్యలను మైనార్టీ సంక్షేమ శాఖ వేగవంతం చేసింది. 

మరిన్ని వార్తలు