నింగీ.. నేలా చూద్దామిలా!

27 Nov, 2021 16:37 IST|Sakshi

కాకినాడ రూరల్‌: సాగరతీర సందర్శకులకు విజ్ఞానం, వినోదం పంచేందుకు సమయం సమీపిస్తోంది. కాకినాడ సూర్యారావుపేట బీచ్‌లో యుద్ధ విమాన మ్యూజియం ఇందుకోసం ముస్తాబవుతోంది. సుదీర్ఘ సముద్ర తీరం కలిగిన మన రాష్టంలో విశాఖ తరువాత కాకినాడ తీరం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడి బీచ్‌కు నిత్యం వేలాదిగా ప్రజల తాకిడి ఉంటుంది. కోవిడ్‌ కొంత ప్రభావం చూపినా బీచ్‌ పూర్వ వైభవం మళ్లీ పొందుతోంది. భవిష్యత్తులో ఇది పర్యాటక కేంద్రంగా వెలుగొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాకినాడ నుంచి ఉప్పాడ వరకూ తీరాన్ని మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దేందుకు ఇక్కడ యుద్ధ విమాన ప్రదర్శన శాల ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.

టీయూ–142ఎం యుద్ధ విమానంతో..
బీచ్‌లో థీమ్‌ పార్కు ఇప్పటికే ఆకట్టుకుంటుండగా యుద్ధ విమానాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. తొలుత ట్రైనీ యుద్ధ విమానం ఏర్పాటు చేసి ప్రదర్శనకు అనుమతించారు.  రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవ తీసుకుని మరో యుద్ధ విమానం ఏర్పాటుకు కృషి చేసింది. దేశ రక్షణ రంగంలో దాదాపు 28 ఏళ్ల పాటు సేవలందించి 2017లో వైదొలగిన టీయూ–142ఎం విమానాన్ని ఇక్కడ నిలపాలని సంకల్పించి సఫలీకృతమైంది. ప్రపంచంలోనే అతి భారీ, పురాతన యుద్ధ విమానాల్లో ఇది ఒకటి కావడం విశేషం. 53 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 12 మీటర్ల ఎత్తు, 100 టన్నుల బరువు (ఇంధనంతో కలిపితే 185 టన్నులు) కలిగిన ఈ యుద్ధ విమానాన్ని చెన్నై నుంచి ఇక్కడికి తీసుకువచ్చారు. బయటి నుంచి చూడటమే కాకుండా లోపలికి వెళ్లి అన్నీ చూసేందుకు వీలుగా దీనిని రూపుదిద్దారు. త్వరలోనే ఈ విమానం మ్యూజియం సందర్శకులకు అందుబాటులోకి రానుంది. యుద్ధ విమానం సేవలు, ఆయుధాలు, శత్రువులపై దాడి, స్వీయరక్షణ వంటి అంశాలను ఇందులో ప్రదర్శిస్తున్నారు. విడి భాగాలను రోడ్డు మార్గంలో తీసుకువచ్చి బిగించారు. సందర్శకులు లోపలకు వచ్చి, బయటకు వెళ్లే మార్గాలను ఏర్పాటు చేయాల్సి ఉంది.

పనుల్లో కొంత జాప్యం
నేవీ డే సందర్భంగా డిసెంబర్‌ 4న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో దీనిని ప్రారంభింపజేయాలని అధికారులు తొలుత భావించారు. ఇందులో భాగంగా తూర్పు నావికాదళం ప్రధాన అధికారి వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్‌ సెప్టెంబర్‌లో వచ్చి పరిశీలించారు. ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న పార్కులో కాకినాడ నగరాభివృద్ధి సంస్థ (కుడా) (గతంలో గుడా) రూ.5.89 కోట్లతో చేపట్టిన విమాన మ్యూజియం పనుల వివరాలను కలెక్టర్‌ సి.హరికిరణ్, కుడా చైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైస్‌ చైర్మన్‌ కె.సుబ్బారావు, వైస్‌ అడ్మిరల్‌కు వివరించారు.  డిసెంబర్‌ 4న ప్రారంభోత్సవం జరిగేలా చూడాలని పనులు చేపడుతున్న తనేజా ఏరోస్పేస్‌ అండ్‌ ఏవియేషన్‌ సంస్థ (విశాఖ) ప్రతినిధి శ్రీనివాస్‌కు సూచించారు. అయితే పనుల్లో కొంత జాప్యం జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సదరు కాంట్రాక్టు సంస్థకు  మొదటి విడత బిల్లు సుమారు రూ.2 కోట్లు గురువారం చెల్లించింది. దీంతో పనులకు అడ్డంకులు తొలగాయి. జనవరి నాటికి ఇది అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు