రాష్ట్రపతి ముర్ముకు రాజమహేంద్రవరంలో ఘన స్వాగతం

29 Dec, 2022 04:08 IST|Sakshi
విమానాశ్రయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతున్న మంత్రులు

మధురపూడి(రాజమహేంద్రవరం): రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయంలో బుధవారం ఘన స్వాగతం లభించింది. ఉదయం 9.40 నిమిషాలకు ఆమె ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ నుంచి భద్రాచలం వెళ్తూ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. కొద్ది నిమిషాలు ఉండి తర్వాత హెలికాప్టర్‌లో భద్రాచలానికి బయలుదేరారు. అంతకు ముందు రాష్ట్రపతికి  జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, హోంమంత్రి తానేటి వనిత స్వాగతం పలికారు.

రాష్ట్రపతి వెంట కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్, తెలంగాణ గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఉన్నారు. స్వాగతం పలికిన వారిలో జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఇన్‌చార్జి ఎస్పీ సిహెచ్‌.సుధీర్‌ కుమార్, ఫైర్‌ శాఖ డీజీ ఎన్‌.సంజయ్, ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు, ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జ్ఞానేశ్వరరావు, విజయనగరం బెటాలియన్‌ కమాండెంట్‌ విక్రమ్‌ సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఉన్నారు.

భద్రాద్రి ఆలయంలో ముర్ము  ప్రత్యేక పూజలు 
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/వరంగల్‌: రాష్ట్రపతి బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పర్యటించారు. రాజమండ్రి నుంచి హెలికాప్టర్‌ ద్వారా సారపాకలోని ఐటీసీకి చేరుకున్న ముర్ము.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి భద్రాద్రి రాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థయాత్ర పునరుజ్జీవనం, స్పిరిచ్యువల్‌ ఆగ్మెంటేషన్‌ డ్రైవ్‌ (ప్రశాద్‌) పథకం ద్వారా రూ.41 కోట్లతో చేపట్టబోతున్న పనులకు శంకుస్థాపన చేశారు.

తెలంగాణ ఆదివాసీ కల్యాణ పరిషత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ పూజారుల సమ్మేళనంలో పాల్గొన్నారు. అదే వేదిక నుంచి వర్చువల్‌ పద్ధతిలో ఆసిఫాబాద్, మహబూబాబాద్‌ జిల్లా నామాలపాడులో కొత్తగా నిర్మించిన ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలను ప్రారంభించారు. ములుగు జిల్లా రామప్ప దేవాల­యాన్ని రాష్ట్రపతి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  

మరిన్ని వార్తలు