కాకినాడ బీచ్‌లో యుద్ధ విమాన మ్యూజియం ..

5 Sep, 2021 11:17 IST|Sakshi

 డిసెంబర్‌ 4న సీఎం చేతుల మీదుగా ప్రారంభం

తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర వెల్లడి

సాక్షి,కాకినాడ రూరల్‌: యుద్ధ విమాన మ్యూజియం కాకినాడ బీచ్‌లో త్వరలోనే ప్రారంభం కానుంది. సంబంధిత పనులు వేగం అందుకున్నాయి. సూర్యారావుపేట బీచ్‌లో ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యాన అభివృద్ధి చేస్తున్న పార్కులో రూ.5.89 కోట్ల కాకినాడ పట్టణాభి వృద్ధి సంస్థ (కుడా) నిధులతో టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం ఏర్పాటు కానున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నానికి చెందిన తనేజా ఏరోస్పేస్‌ అండ్‌ ఏవియేషన్‌ సంస్థ ఈ పనులు చేపడుతోంది. ఈ పనులను తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్‌ శనివారం స్వయంగా పరిశీలించారు.

ఆయనకు కలెక్టర్‌ సి.హరికిరణ్, నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్, కుడా చైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, వైస్‌ చైర్మన్‌ కె.సుబ్బారావు, జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఆర్డీఓ చిన్నికృష్ణ తదితరులు స్వాగతం పలికారు. యుద్ధ విమానాన్ని పరిశీలించిన వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర ప్రజా సందర్శనకు వీలుగా చేపట్టబోయే పనుల గురించి కలెక్టర్‌ హరికిరణ్, తనేజా సంస్థ ప్రతినిధి శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. విశాఖపట్నంలో మాదిరిగా సందర్శకులు చూసేందుకు ప్రవేశ ద్వారం ఏర్పాటు చేయాలని సూచించారు. రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలన్నారు. డిసెంబర్‌ 4న ప్రారంభోత్సవం జరిగేలా చూడాలన్నారు. మ్యూజియం, పార్కు అభివృద్ధి పురోగతి, పెండింగ్‌ పనులపై సమీక్షించారు. 

పనులపై వైస్‌ అడ్మిరల్‌ సంతృప్తి
మ్యూజియం పనులపై కలెక్టర్‌ హరికిరణ్, కుడా వీసీ సుబ్బారావులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వైస్‌ అడ్మిరల్‌కు వివరించారు. బహదూర్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ త్వరితగతిన మ్యూజియం పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్న జిల్లా అధికారులను అభినందించారు. పనులు పూర్తయ్యాక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మ్యూజియాన్ని ప్రారంభిస్తారన్నారు. కలెక్టర్‌ హరికిరణ్‌ మాట్లాడుతూ యూటీ–142 యుద్ధ విమాన మ్యూజియం పనులు త్వరిగతిన జరుగుతున్నాయన్నారు.

వీటని 60 నుంచి 90 రోజుల్లో పూర్తి చేస్తామని తనేజా సంస్థ ప్రతినిధి తెలిపారన్నారు. కోల్‌కతా, విశాఖపట్నం తర్వాత కాకినాడలో మాత్రమే యుద్ధ విమాన మ్యూజియం ఉందన్నారు. ఏపీ టూరిజం విభాగం స్నాక్స్‌ బార్, ఇంటర్‌ప్రెటేన్‌ సెంటర్‌ ఏర్పాటుతో పాటు రూ.1.50 కోట్లతో పచ్చదనం ఉండేలా పార్కును అభివృద్ధి చేస్తుందన్నారు. కుడా పీఓ సత్యనారాయణమూర్తి, ఏపీలు సూర్యనారాయణ, కృష్ణ, శాంతిలత, తహసీల్దార్‌ మురళీకృష్ణ, రాగిరెడ్డి బన్నీ, సిద్ధార్ధ తదితరులు పాల్గొన్నారు. సమీపంలోని నేవల్‌ ఎన్‌క్లేవ్‌ వద్దకు వెళ్లిన వైస్‌ అడ్మిరల్‌ అక్కడి సిబ్బందితో భేటీ అయ్యారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు