నీళ్లింకిపోతున్న నేత్రాలు

1 May, 2022 12:35 IST|Sakshi

నేత్రాలు నిండు జలాశయాల వంటివి. అయితే మనిషి నిర్లక్ష్యంతో కళ్లల్లో నీరు ఆవిరవుతోంది. అధిక గంటలు స్మార్ట్‌   ఫోన్‌తో గడిపేస్తుండటం.. వేడి గాలుల్లో ప్రయాణాలు చేస్తుండటంతో కళ్లల్లో కల్లోలం అలముకుని ఎడారిలా    మారిపోతున్నాయి. చివరకు చూపుపై ప్రభావం పడుతోంది. 
– లబ్బీపేట (విజయవాడ తూర్పు)

సమస్య ఏంటంటే.. 
మనిషి నిమిషానికి ఎనిమిది సార్లు కంటి రెప్పలు ఆర్పుతుంటాడు. అలా చేయడం ద్వారా కార్నియాకు అవసరమైన నీరు చేరి కళ్లు డ్రై కాకుండా చేస్తాయి. కానీ వేసవి ప్రయాణాల్లో వేడి గాలులకు కళ్లు తడారిపోయి దురదలు రావడం, కార్నియా సమస్యలు తలెత్తుతుంటాయి. ఇటీవల కాలంలో పిల్లలు అధిక సమయం స్మార్ట్‌ ఫోన్‌తోనే గడుపుతున్నారు. ఇలా స్మార్ట్‌ఫోన్‌ చూసే సమయంలో కనురెప్పులు నిమిషానికి రెండు, మూడు సార్లు మాత్రమే ఆర్పుతుంటారని వైద్యులు చెబుతున్నారు.

దీంతో కళ్లు తడారిపోయి దురదలు, మంటలు రావడం, కొందరికి తలనొప్పి వంటి సమస్యలు వస్తున్నట్లు నేత్ర వైద్యులు వివరిస్తున్నారు. విజయవాడలో కంటి వైద్యులను ఆశ్రయిస్తున్న రోగుల్లో 60 నుంచి 70 శాతం మంది స్మార్ట్‌ ఫోన్‌ కారణంగా కార్నియా సమస్యలకు గురవుతున్నట్లు చెబుతున్నారు. నిత్యం ఐదు నుంచి ఆరు  గంటలు ఫోన్‌ వాడే వారిలో నేత్రాలు పొడారిపోవడంతో కార్నియా(నల్లగుడ్డు) సమస్యలు వస్తున్నట్లు వివరిస్తున్నారు. అలా వస్తున్న వారిలో 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు వారు ఎక్కువగా ఉంటున్నారు. ముఖ్యంగా యువత రాత్రి సమయంలో దుప్పటి ముసుగు వేసుకుని, పడుకుని చీకట్లో స్మార్ట్‌ఫోన్‌ వాడే వారిలో ఈ అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.  

ఈ జాగ్రత్తలు పాటించాలి
వేసవిలో ప్రయాణాలు చేసే వారు తప్పనిసరిగా కళ్లజోడు వినియోగించాలి.  
తరచూ ముఖాన్ని చన్నీటితో కడుక్కోవడం మంచిది.  
స్మార్ట్‌ ఫోన్‌ను బ్రైట్‌నెస్‌ తక్కువగా పెట్టుకుని ఉపయోగించాలి.  
కళ్లకు ఫోన్‌ 15 సెంటీమీటర్ల దూరంలో ఉంచి చూడాలి. ముఖానికి దగ్గరగా పెట్టకూడదు.  
20 నిమిషాల పాటు ఫోన్‌ , కంప్యూటర్‌ వాడిన తర్వాత 20 సెకన్ల పాటు దూరంలో ఉన్న వస్తువులను చూడాలి.   
ఎట్టి పరిస్థితుల్లో చీకట్లో స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించరాదు.  
కంప్యూటర్‌పై పనిచేసే వారు యాంటీ రిఫ్లెక్టివ్‌ గ్లాసెస్‌ వాడితే ప్రయోజనకరంగా ఉంటుంది.  
రోజులో ఎక్కువసేపు స్మార్ట్‌ ఫోన్, కంప్యూటర్‌పై పనిచేసే వారు ఐ డ్రాప్స్‌ వాడటం ద్వారా దుష్ఫలితాలు లేకుండా చూడవచ్చు.

అలర్ట్‌ అవ్వాల్సిందే.. 
కళ్లు మంటలు, దురదలు రావడం, వెలుతురు సరిగ్గా చూడలేక పోవడం, కళ్లు ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా డ్రైవింగ్‌ చేసే సమయంలో ఏకాగ్రతను కోల్పోయి కంగారు పడుతుంటారు. ఈ దశలో సరైన చికిత్స పొందకుంటే నల్లగుడ్డు (కార్నియా) దెబ్బతిని చూపుమందగించే ప్రమాదం ఉంది. 

సకాలంలో చికిత్స అవసరం.. 
వేసవిలో ప్రయాణాలు చేసే వారు కళ్ల విషయంలో అప్రమత్తంగా  ఉండాలి. వేడి  గాలులు కళ్లకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్లజోడు వాడటం        మంచిది. లేకుంటే వేడి గాలులకు కళ్లు పొడారిపోతాయి. స్మార్ట్‌ ఫోన్‌ వల్ల తలెత్తే సమస్యలకు సకాలంలో చికిత్స పొందాలి. లేకుంటే క్రమేణా కార్నియా దెబ్బతిని చూపుకోల్పోయే ప్రమాదం ఉంది. మా వద్దకు చికిత్స కోసం  వస్తున్నవారిలో 60 శాతం మందికి ఇలాంటి సమస్యలతో బాధపడే వారే ఉంటున్నారు. 
– డాక్టర్‌ ఇ.ఎస్‌.ఎన్‌.మూర్తి, నేత్రవైద్య నిపుణుడు, ప్రభుత్వాస్పత్రి

మరిన్ని వార్తలు