శాంతించిన కృష్ణమ్మ.. శ్రీశైలంలోకి తగ్గిన వరద ప్రవాహం

4 Aug, 2021 03:44 IST|Sakshi

పశ్చిమ కనుమల్లో తగ్గుముఖం పట్టిన వర్షాలు

శ్రీశైలంలోకి తగ్గిన వరద ప్రవాహం

నాగార్జునసాగర్, పులిచింతల గేట్లు మూసివేత

ప్రకాశం బ్యారేజీ నుంచి 1.96 లక్షల క్యూసెక్కులు కడలిలోకి..

గోదావరిలోనూ తగ్గిన వరద

సాక్షి, అమరావతి/గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌)/శ్రీశైలం ప్రాజెక్ట్‌/సత్రశాల(రెంటచింతల)/అచ్చంపేట/విజయపురి సౌత్‌: పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణమ్మ శాంతించింది. అధికారులు ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లో ఖాళీ ప్రదేశాలను భర్తీ చేస్తూ.. దిగువకు విడుదల చేసే నీటి పరిమాణాన్ని తగ్గిస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌లోనూ అదే పరిస్థితి ఉంది. దీంతో శ్రీశైలంలోకి వచ్చే వరద తగ్గింది. శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు, కుడి, ఎడమ గట్టు విద్యుత్కేంద్రాల ద్వారా 1,77,321 క్యూసెక్కులను వదులుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు 29,792 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 2,026 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. వరద ఉధృతి తగ్గడంతో నాగార్జునసాగర్‌ గేట్లను మూసివేశారు. సాగర్‌ విద్యుత్కేంద్రాల ద్వారా దిగువకు 68,126 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ నీటితో దిగువన టెయిల్‌పాండ్‌ను నింపుతున్నారు.

నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నుంచి 23,706 క్యూసెక్కుల నీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు డీఈ దాసరి రామకృష్ట, ఏఈఈ కె.నాగ నరసింహారావు మంగళవారం తెలిపారు. మొత్తం మీద పులిచింతలలోకి 51 వేల క్యూసెక్కులు చేరుతున్నాయి. పులిచింతల గేట్లను కూడా అధికారులు మూసివేశారు. ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుతుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద ఉధృతి కాస్త తగ్గింది.

మంగళవారం రాత్రి 7 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 2,05,689 క్యూసెక్కులు చేరుతుండగా.. 9,689 క్యూసెక్కులను కాలువలకు విడుదల చేశారు. మిగులుగా ఉన్న 1.96 లక్షల క్యూసెక్కులను 70 గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదులుతున్నారు. జూన్‌ 1 నుంచి మంగళవారం రాత్రి 7 గంటల వరకు సుమారు 77 టీఎంసీల జలాలు సముద్రంలో కలవడం గమనార్హం. గోదావరిలోనూ వరద తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి వస్తున్న నీటిని డెల్టాకు విడుదల చేయగా.. మిగులుగా ఉన్న 91 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు