15 నుంచి గోదావరి డెల్టాకు నీరు

7 Jun, 2021 04:32 IST|Sakshi

పక్కాగా పంటల ప్రణాళిక

రైతులు గిరాకీ ఉన్న వరి వంగడాలే పండించాలి

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు 

కాకినాడ రూరల్‌: గోదావరి డెల్టా ఆయకట్టుకు ఈ నెల 15 నుంచి కాలువల ద్వారా నీరు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. జలవనరులశాఖ మంత్రి సమక్షంలో ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులు, రైతులతో చర్చించి నీటి విడుదలపై ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని తెలిపారు. రైతులు నష్టపోకుండా తొలిసారిగా పంటల ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. మార్కెట్‌లో గిరాకీ ఉన్న వరి వంగడాలనే వచ్చే ఖరీఫ్‌లో పండించాలని రైతులకు సూచించారు. ఆయన ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని తన క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. రైతులు, వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా విశాఖపట్నంలో మూడు, తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ తూరంగి, జగన్నాథపురం వద్ద కొత్తగా రైతుబజార్లు మంజూరు చేశామని చెప్పారు. మార్కెట్‌ సౌకర్యాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారన్నారు.  

రూ.212 కోట్లతో మార్కెట్‌ యార్డుల అభివృద్ధి
వ్యవసాయ మార్కెట్‌ యార్డుల ఆధునికీకరణకు నాడు–నేడు పథకం ద్వారా శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తొలిదశలో రూ.212 కోట్లతో మార్కెట్‌ యార్డులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రబీలో 24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. సీఎం జగన్‌ ఆదేశాలకు అనుగుణంగా కొనుగోలు చేసిన ధాన్యానికి 21 రోజుల్లో రైతు ఖాతాకు సొమ్ము జమచేస్తున్నామన్నారు. రైతు భరోసా కేంద్రాలను కొనుగోలు కేంద్రాలుగా మార్చి, అక్కడ పేరు నమోదు చేసుకున్న రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో బొండాలు రకం ధాన్యాన్ని మిల్లర్లు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్టు తెలియడంతో సీఎం ఆదేశాల మేరకు కనీస మద్దతు ధర అమలయ్యేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు