మళ్లీ శ్రీశైలం ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేత

5 Aug, 2022 04:22 IST|Sakshi
శ్రీశైలంలో ఒక గేటు ద్వారా నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్న దృశ్యం

ప్రాజెక్టులోకి 2,25,372 క్యూసెక్కుల ప్రవాహం

ప్రస్తుతం 884.4 అడుగుల్లో 212.43 టీఎంసీల నిల్వ

సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్టు/రామగిరి: ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర నుంచి దిగువకు భారీగా వరద వస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం మరింతగా పెరిగింది. గురువారం రాత్రి 9 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,25,372 క్యూసెక్కులు చేరుతోంది. నీటి నిల్వ 884.4 అడుగుల్లో 212.43 టీఎంసీల గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో మళ్లీ ఒక గేటును పది అడుగుల మేర ఎత్తి 27,800 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 64,073 క్యూసెక్కులు వదులుతున్నారు. దాంతో సాగర్‌లోకి వరద ప్రవాహం పెరుగుతోంది.

ప్రస్తుతం సాగర్‌లో 562.5 అడుగుల్లో 238.24 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్‌ నిండాలంటే ఇంకా 73 టీఎంసీలు కావాలి. సాగర్‌కు దిగువన మూసీలో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పులిచింతలలోకి 10,400 క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదుత్పత్తి చేస్తూ అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. దీనికి పాలేరు, మున్నేరు తదితర వాగుల వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 22,107 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 12,043 క్యూసెక్కులు వదులుతూ బ్యారేజ్‌ గేట్లు ఎత్తి 10,064 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. మరోవైపు.. గోదావరిలో వరద ప్రవాహం మరింతగా తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 2.66 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 11 వేల క్యూసెక్కులు గోదావరి డెల్టాకు వదులుతూ మిగులుగా ఉన్న 2.55 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. 

కృష్ణా ఉప నదులు పరవళ్లు..
రెండ్రోజులుగా రాయలసీమ, కర్ణాటకలోని బళ్లారి, కొప్పళ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా ఉపనది అయిన వేదవతి.. పెన్నా, దాని ఉప నదులు చిత్రావతి, పాపాఘ్ని పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో.. చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల్లోకి భారీగా వరద ప్రవాహం చేరుతుండడంతో అవి నిండుకుండలను తలపిస్తున్నాయి. అలాగే, అనంతపురం జిల్లాలోని అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టు (పేరూరు డ్యామ్‌) గేట్లు ఎత్తేసి దిగువకు పది వేల క్యూసెక్కులు వదిలేస్తున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఈ డ్యామ్‌ 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టులోకి పూర్తిస్థాయిలో వరద రావడం.. అన్నిగేట్లు ఎత్తడం మూడు దశాబ్దాల్లో ఇదే ప్రథమం.  

మరిన్ని వార్తలు