తెలుగు రాష్ట్రాల్లో జల సిరులు

6 Feb, 2021 03:52 IST|Sakshi
నీటితో కళకళలాడుతున్న శ్రీశైలం డ్యాం (ఫైల్‌)

ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వ అధికం

గత పదేళ్లలో ఈ ఏడాదే గరిష్ట నీటి నిల్వలు

రబీ పంటల సాగుకు, వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేనట్లే

కేంద్ర జల సంఘం అధ్యయనంలో వెల్లడి

సాక్షి, అమరావతి: ఉత్తరాదితో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో.. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాల్లో నీటి నిల్వ అధికంగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ వెల్లడించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నదుల్లో వరద ప్రవాహం, సహజ సిద్ధ వరద ప్రవాహం కనిష్ట స్థాయికి చేరుకుంది. ఖరీఫ్‌ పూర్తయింది. రబీలో పంటలు సాగు చేస్తున్నారు. ఈ దశలో సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) దేశంలో తన పర్యవేక్షణలోని 128 జలాశయాల్లో నీటి నిల్వలపై అధ్యయనం చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లోని జలాశయాల్లోని నీటి నిల్వలు గత పదేళ్ల సగటుతో పోల్చితే ఈ ఏడాది 50% అధికంగా ఉన్నట్లు ఆ అధ్యయనంలో తేలింది. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. 

► దేశ వ్యాప్తంగా సీడబ్ల్యూసీ పర్యవేక్షణలోని 128 జలాశయాల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9,104.38 టీఎంసీలు. ప్రస్తుతం ఈ జలాశయాల్లో 3,716.42 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది ఇదే రోజుకు 4,116.42 టీఎంసీలు ఉండేవి. గత పదేళ్లలో ఈ జలాశయాల్లో సగటున 3,021.99 టీఎంసీలు నిల్వ ఉండేవి.
► దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో సీడబ్ల్యూసీ పర్యవేక్షణలోని జలాశయాల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 1,864.94 టీఎంసీలు. ప్రస్తుతం ఈ జలాశయాల్లో 1,169.60 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది ఇదేరోజు వీటిలో 1,133.23 టీఎంసీలు నిల్వ ఉండేవి. గత పదేళ్లలో ఈ జలాశయాల్లో సగటున 787.5 టీఎంసీల నిల్వ ఉండేవి. అంటే.. గత పదేళ్ల సగటు నీటి నిల్వ కంటే ఈ ఏడాది 50 శాతం అధికంగా నిల్వ ఉన్నట్లు స్పష్టమవుతోంది.
► ఉత్తరాది, ఈశాన్య, పశ్చిమ, మధ్య భారతదేశంలోని రాష్ట్రాల్లోని జలాశయాల్లో నీటి నిల్వలు గతేడాది కంటే ఈ ఏడాది తక్కువగా ఉన్నాయి.
► దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాల్లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. కృష్ణా బేసిన్‌లో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లోనూ.. గోదావరి బేసిన్‌లో శ్రీరాంసాగర్, నిజాంసాగర్, లోయర్‌ మానేరు డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లోనూ.. పెన్నా బేసిన్‌లో సోమశిల, కండలేరు, ఇతర బేసిన్‌లలో ఏలేరు జలాశయంలో నీటి నిల్వలు గతేడాది కంటే అధికంగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ పేర్కొంది.
► ఈ ఏడాది ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో రబీ పంటల సాగుకు.. వేసవిలో తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సీడబ్ల్యూసీ అంచనా వేసింది.   

మరిన్ని వార్తలు