వైఎస్సార్‌–జగనన్న కాలనీల్లో రూ.920 కోట్లతో నీటిసరఫరా

10 May, 2021 05:00 IST|Sakshi

8,268 లే అవుట్లలో నీటి సరఫరా పనులు మంజూరు 

ఇప్పటికే 6,410 లే అవుట్లలో పనులు ప్రారంభం 

1,730 పనులు పూర్తి     

పెద్ద లే అవుట్లలో మూడు, నాలుగు చోట్ల బోర్లు 

సాక్షి, అమరావతి: పేదల కోసం పెద్ద ఎత్తున నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించిన వైఎస్సార్‌–జగనన్న కాలనీల్లో తొలిదశలో 8,679 లే అవుట్లలో రూ.920 కోట్లతో నీటిసరఫరా పనులను ప్రభుత్వం చేపట్టింది. తొలిదశలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 8,905 లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిలో 8,679  లే అవుట్లలో (గ్రామీణ ప్రాంతాల్లో 8,207, పట్టణ ప్రాంతాల్లో 472) నీటిని సమకూర్చాల్సి ఉందని అధికారులు గుర్తించారు. ఇప్పటికే 8,268 లే అవుట్లలో 8,483 నీటిసరఫరా పనులను మంజూరు చేయగా 6,410 లే అవుట్లలో 7,420 పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో ఇప్పటికే 1,730 లే అవుట్లలో 1,730 నీటిసరఫరా పనులు పూర్తయ్యాయి. 4,680 లే అవుట్లలో 5,690 నీటి సరఫరా పనులు పురోగతిలో ఉన్నాయి. పేదలకు సంబంధించి తొలిదశ ఇళ్ల నిర్మాణాల్లో ప్రత్యేకంగా నీటిసరఫరా కోసం ఏకంగా రూ.920 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. గతంలో ఏ ప్రభుత్వాలు ఇళ్ల నిర్మాణాల ప్రారంభానికి ముందే నీటిసరఫరా వసతిని కల్పించిన దాఖలాల్లేవు. దీన్నిబట్టి చూస్తే పేదల ఇళ్ల నిర్మాణాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో స్పష్టం అవుతోందని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 

ఈ నెలాఖరుకు నీటిసరఫరా పనులు పూర్తి 
వచ్చే నెల 1వ తేదీ నుంచి ఎట్టి పరిస్థితుల్లోను వైఎస్సార్‌–జగనన్న కాలనీల్లో పేదల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాల్సిందేనని సీఎం ఆదేశించారు. దీంతో ఈ నెలాఖరుకల్లా ఈ కాలనీల్లో నీటిసరఫరా పనులను పూర్తిచేస్తాం.  లే అవుట్ల సైజు ఆధారంగా ఒక్కోచోట రెండేసి చొప్పున, పెద్ద లే అవుట్లలో అయితే 3 లేదా 4 బోర్లు వేస్తున్నాం. దీంతో పాటు మోటారు కనెక్షన్‌ ఇవ్వడమే కాకుండా లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాల దగ్గరకు నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇళ్ల నిర్మాణాల కోసమే ఈ బోర్లు వేస్తున్నాం. ఆ తరువాత ఇవే బోర్లు ఆయా కాలనీల్లో ప్రజలకు ఉపయోగపడతాయి. రూ.920 కోట్లతో చేపట్టిన నీటిసరఫరా పనుల్లో రూ.641 కోట్ల పనులను గ్రామీణ నీటిసరఫరా ఇంజనీరింగ్‌ విభాగం, రూ.279 కోట్ల పనులను ప్రజారోగ్య ఇంజనీరింగ్‌ విభాగం చేపట్టాయి.  
– అజయ్‌జైన్, గృహనిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్‌   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు