వేగంగా ఆక్సిజన్‌ చేరుస్తున్నాం

18 May, 2021 04:26 IST|Sakshi
పోలీస్‌ శాఖకు ఆక్సిజన్‌ సిలిండర్లు, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్, ఎన్‌–95 మాస్కులను అందజేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలకనుగుణంగా రాష్ట్రంలో అన్ని ఆస్పత్రులకు ఆక్సిజన్‌ను వేగంగా, సురక్షితంగా అందించేందుకు పోలీస్‌ శాఖ కృషి చేస్తోందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. వేరే రాష్ట్రాలు, మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ను తరలించేటప్పుడు జాప్యం జరగకుండా, ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా గ్రీన్‌ చానల్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆక్సిజన్‌ సరఫరా చేసే 11 ప్లాంట్లను మ్యాపింగ్‌ చేసి అక్కడ నుంచి ఎటువంటి అవరోధాలు లేకుండా రవాణా జరిగేలా చర్యలు చేపట్టామన్నారు.

ఇందుకు సంబంధించి ఒడిశా, తమిళనాడు, కర్ణాటక డీజీపీలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని తెలిపారు. ఆయా రాష్ట్రాల నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్లు ప్రయాణించే మార్గాల్లో ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా పోలీస్‌ ఎస్కార్ట్‌ వాహనాలను పంపుతున్నామన్నారు. ఆక్సిజన్‌ ట్యాంకర్లకు జీపీఎస్‌ అమర్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పొరుగు రాష్ట్రాల పోలీసులు తమ రాష్ట్ర సరిహద్దుల వరకు ఎస్కార్ట్‌గా వచ్చి ఆక్సిజన్‌ ట్యాంకర్లను అప్పగిస్తున్నారని తెలిపారు. ఆక్సిజన్‌ రవాణాను స్టేట్‌ ఆక్సిజన్‌ వార్‌ రూమ్‌ నుంచి ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు, ఆయా జిల్లాల పోలీస్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు. 

ఆక్సిజన్‌ సిలిండర్లు అందించిన ఎమ్మెల్యే వంశీ 
కరోనా సెకండ్‌ వేవ్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆపద కాలంలో అందుబాటులో ఉండేలా కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ ఆక్సిజన్‌ సిలిండర్లు అందజేశారు. మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి సోమవారం వెళ్లిన వంశీ, పలు సంస్థలకు చెందిన దాతలు డీజీపీ సవాంగ్‌కి 25 ఆక్సిజన్‌ సిలిండర్లు, 10 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, 25 వేల ఎన్‌95 మాస్క్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాడ్యులర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ జనరల్‌ మేనేజర్‌ రమేశ్‌ జైన్, ఆర్‌ఆర్‌హెడ్‌ సీఈవో పులిపాటి కెన్నడి పాల్గొన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు