నీట్‌ కనీస వయో పరిమితిపై జోక్యం చేసుకోలేం 

26 Mar, 2023 04:49 IST|Sakshi

తేల్చి చెప్పిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు 

ఓ విద్యార్థి ని తండ్రి పిటిషన్‌ కొట్టివేత 

సాక్షి, అమరావతి : జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)కు హాజరయ్యేందుకు కనీస వయో పరిమితి 17 సంవత్సరాలుగా నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమంది. కనీస వయస్సును 17 సంత్సరాలుగా నిర్ణయించడం సమానత్వపు హక్కును హరించినట్లు కాదని స్పష్టంచేసింది. ఇదే అంశంపై జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ ఉమ్మడి హైకోర్టు గతంలోనే తీర్పునిచ్చిందని, ఓసారి తేలిన అంశంలో మరోసారి జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది.నీట్‌కు కనీస వయోపరిమితి నిబంధనను కొట్టేయాలంటూ వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన ఓ మైనర్‌ విద్యార్థిని తండ్రి నాగ మునుస్వామి హైకో­ర్టు­లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది అనూప్‌ కౌషిక్‌ వాదనలు వినిపిస్తూ, ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, సమానత్వ, వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోందని అన్నారు.

పిటిషనర్‌ కుమార్తెకు నీట్‌ అర్హత వయస్సుకు నాలుగు రోజులు తక్కువ ఉందన్నారు. పరీక్షకు అనుమతించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ (డీఎస్‌జీ) ఎన్‌.హరినాథ్, జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) తరపున న్యా­య­వాది ఎస్‌.వివేక్‌ చంద్రశేఖర్‌లు వాదనలు వినిపిస్తూ.. ఇదే అంశంపై గతంలో దాఖలైన వ్యాజ్యాలను ఉమ్మడి హైకోర్టు కొట్టేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వీరి వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం ఇదే అంశంపై తీర్పునిచ్చినప్పుడు దానికి విరుద్ధంగా స్పందించలేమంది. పరీక్ష రాసేందుకు నాలుగు రోజులు తక్కువైనా, ఒక్క రోజు తగ్గినా కూడా తాము ఏమీ చేయలేమని స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు