ఎస్‌ఈసీ నిర్ణయాల్లో తలదూర్చలేం: సుప్రీం

25 Jan, 2021 14:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేసింది. ఎస్‌ఈసీ నిర్ణయాల్లో తాము తలదూర్చలేమని పేర్కొంది. ఎన్నికల వాయిదాకు నిరాకరించింది. కాగా ఏపీలో స్థానిక సంస్థలను నిర్వహించాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌కౌల్, జస్టిస్‌ హృషీకేష్‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం తాజా తీర్పును వెలువరించింది. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో  నెలకొన్న పరిస్థితులను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. లక్షలమంది ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వాలని ఆ ప్రక్రియ పూర్తి కాకముందే ఎన్నికలు నిర్వహించడం సరైనది కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 5లక్షల ఉద్యోగులకు కోవిడ్‌ వాక్సిన్‌ ఇవ్వాలని, వారి సహకారం లేనిది  ఎన్నికలు నిర్వహించలేమని ధర్మాసనం ముందు వాదించారు.

ఎన్నికలు జరగాలంటే పోలీసుల సహకారం చాలా అవసరమని, పోలీసులకు కూడా వాక్సిన్‌ ఇవ్వాలన్నారు. కరోనా దృష్ట్యా ఇప్పటికే గోవాలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. మార్చి 1 నుంచి ఎన్నికలు నిర్వహించడానికి అభ్యంతరం లేదన్నారు. జనవరి 28కల్లా ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు వాక్సిన్‌ ఇవ్వడం పూర్తిఅవుతుందని వివరించారు. వాక్సిన్‌, ఎలక్షన్‌ ఒకేసారి నిర్వహించాలని హైకోర్టు చెప్పడం సరికాదని రోహత్గీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వాదనతో ఏకీభవించని న్యాయస్థానం ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది.
 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు