Plastic: అంతం కావాలంటే పంతం కొనసాగాలి

26 Sep, 2022 16:00 IST|Sakshi

మళ్లీ పెరిగిపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు 

జూలై నెలలో 5 టన్నుల వరకు నియంత్రణ

ఆగస్టు నుంచి తిరిగి పుంజుకున్న వినియోగం

ఉమ్మడి అనంతపురం జిల్లాలో నెలకు 28 టన్నులకు పైగా వ్యర్థాలు 

ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించేందుకు కఠిన వైఖరి అవలంబించాల్సిందే

ప్లాస్టిక్‌ వాడకం తగ్గించి భయంకర  జబ్బులను నియంత్రించే దిశగా జూలై ఒకటో తేదీన ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా  అధికారులు అడుగులు వేశారు. కానీ రెండు మాసాలు కూడా గడవక  ముందే అధికారులు శ్రద్ధ తగ్గించారు.   దీంతో మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు మళ్లీ యథాతథంగా పెరిగాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలకు చిరునామాగా నిలిచిన అనంతపురం నగరపాలక సంస్థలో జూలై నెలకు ముందు ఎంత ఉత్పత్తి అయ్యేవో  అంత కంటే ఎక్కువగా ఆగస్టులో పెరిగాయి. దీన్ని బట్టి ప్లాస్టిక్‌ అంతం  కోసం అధికారులు దూకుడు కొనసాగించాల్సిన అవసరం కనిపిస్తోంది.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఒక కార్పొరేషన్, ఎనిమిది మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడే ఎక్కువగా ప్లాస్టిక్‌ వినియోగం జరిగేది. ఈ ఏడాది జూలై ఒకటో తేదీకి ముందు నెలకు సగటున 28.5 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అయ్యేవి. జూలై ఒకటి తర్వాత అధికారులు ప్లాస్టిక్‌ నియంత్రణ కోసం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దీంతో ఆ మాసంలో ఐదు టన్నుల వరకు ప్లాస్టిక్‌ వ్యర్థాలు తగ్గాయి.

అనంతపురంలో టన్నులకొద్దీ...
అనంతపురం కార్పొరేషన్‌ పరిధిలో మరీ దారుణంగా ఉంది. నియంత్రణ చర్యలు తీసుకోకమునుపు నెలకు 12 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉత్పత్తయ్యేవి. జూలైలో రెండు టన్నులు తగ్గి 10 టన్నులకు చేరింది. అధికారులు తనిఖీలు తగ్గించడంతో ఆగస్టులో  గతం కంటే ఎక్కువగా 14 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు పెరిగాయి. ముఖ్యంగా అనంతపురం పాతూరులోని హోల్‌సేల్‌ దుకాణాల నుంచి టన్నుల కొద్దీ ప్లాస్టిక్‌ కవర్లు, కప్పులు ఇలా రకరకాల వస్తువులు ఇతర మున్సిపాలిటీలకు సరఫరా అవుతున్నాయి. చిన్న చిన్న షాపులు మొదలుకొని పెద్ద హోటళ్ల వరకూ మళ్లీ ప్లాస్టిక్‌ ఉత్పత్తులు వాడుతున్నారు. మున్సిపల్‌    అధికారుల తనిఖీలు  తగ్గడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అధికారులు దాడులు చేస్తేనే నియంత్రణలోకి రాదని, ప్లాస్టిక్‌పై ప్రజలు కూడా ఆలోచించి వాడకాన్ని తగ్గిస్తేనే ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. 

ప్రజల్లోనూ మార్పు రావాలి 
అధికారులు చర్యలు తీసుకోవడంతో పాటు ప్లాస్టిక్‌ వాడకంతో కలిగే నష్టాలపై ప్రజలూ ఆలోచించాలి. అత్యంత భయంకర జబ్బులకు మూలమైన ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడంలో ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు రావాలి. అందరిలో మార్పు వస్తేనే ప్లాస్టిక్‌ వినియోగ నియంత్రణ సాధ్యం. 
– శంకర్‌రావు, పర్యావరణ ఇంజినీర్, కాలుష్యనియంత్రణ మండలి 

స్పెషల్‌ డ్రైవ్‌ చేపడతాం  
ప్లాస్టిక్‌ నివారణ చర్యల్లో భాగంగా మళ్లీ స్పెషల్‌ డ్రైవ్‌ చేపడతాం. ఇప్పటికే శానిటేషన్‌ కార్యదర్శులు వారి పరిధిలోని వ్యాపార సముదాయాల్లో రోజూవారీ తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్‌ను వినియోగిస్తే..అపరాధ రుసుం వసూలు చేస్తాం. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. ప్రజలు సైతం సామాజిక బాధ్యతగా ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేయాలి. 
– కె.భాగ్యలక్ష్మి, కమిషనర్, అనంతపురం నగరపాలక సంస్థ  
 

మరిన్ని వార్తలు