సీఎం జగన్‌ను ఘనంగా సన్మానిస్తాం 

20 Aug, 2022 08:52 IST|Sakshi

సెప్టెంబరు చివరలో లేదా అక్టోబరులో సచివాలయ ఉద్యోగులతో భారీ సభ

అధికారంలోకి వచ్చిన వెంటనే 1.34 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన సీఎం జగన్‌

జూన్‌ 30 నాటికే అర్హత ఉన్న ఉద్యోగులందరినీ పర్మినెంట్‌ చేశారు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి

సాక్షి, అమరావతి: సెప్టెంబర్‌ చివర లేదా అక్టోబర్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విజయవాడలో భారీ  సభ నిర్వహించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఘనంగా సన్మానించాలని నిర్ణయించినట్టు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి చెప్పారు. శుక్రవారం విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేయడం, నాలుగు నెలల్లో 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను మంజూరు చేయడంతో పాటు వాటిని భర్తీ కూడా చేశారని చెప్పారు.

అప్పట్లో ఉద్యోగాలు పొందిన వారిలో అర్హులైన ఉద్యోగులందరి సర్వీసును ఈ ఏడాది జూన్‌ 30 నాటికి పర్మినెంట్‌ కూడా చేశారని వివరించారు. తాజాగా సచివాలయాల ఉద్యోగుల బదిలీల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు సీఎం జగన్‌కి మానస పుత్రిక లాంటివని, ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తున్నారని చెప్పారు. మనందరికీ మంచి చేసే ప్రభుత్వం ఉందని, ఇలాంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.  

ప్రభుత్వం ఆదేశాల మేరకు అందరం సక్రమంగా పని చేద్దామన్నారు.  ప్రజలకు మేలు చేస్తున్న ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థలు అదే పనిగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని వెంకట్రామిరెడ్డి తప్పుపట్టారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కొన్ని వ్యవస్థలు సైతం కంట్రోల్‌  చేయాలని చూస్తున్నాయని విమర్శించారు. గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ హోదాలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎలా వ్యవహరించారో చూశామన్నారు. కడపలో సచివాలయ ఉద్యోగిపై  దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజన్‌రెడ్డి కోరారు. సచివాలయాల ఉద్యగులను ప్రభుత్వం పర్మినెంట్‌ చేయదని కొందరు చేసిన తప్పుడు ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ సీఎం అందరినీ పర్మినెంట్‌ చేశారని సంఘం ప్రధాన కార్యదర్శి బి.అంకమరావు చెప్పారు. ఉద్యోగులతో మంచిగా ఉండే సీఎం ఉండటం మన అదృష్టమని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు ఆర్‌ఆర్‌ కిషోర్‌ భార్గవ్‌ సుతేజ్, విపర్తి నిఖిల్‌కృష్ణ, సుధాకర్, రామకృష్ణ, మధు తదితరులు పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు