సుందర నగరంగా కడప 

1 Nov, 2022 16:56 IST|Sakshi

తాగునీరు,  పరిశుభ్రత, పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌ బాషా, నగర మేయర్‌ సురేష్‌బాబు

అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో నగరాభివృద్ధి

ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి 

నగర పాలక సంస్థ సర్వసభ్య  సమావేశంలో పలు సమస్యలపై చర్చ 

కడప కార్పొరేషన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి కడప నగరాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా, నగర మేయర్‌ సురేష్‌బాబు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం స్థానిక నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో నగర మేయర్‌ కె.సురేష్‌బాబు అధ్యక్షతన నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం జరిగింది. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఆహ్వానితులుగా హాజరు కాగా, మున్సిపల్‌ కమిషనర్‌ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ నగర అభివృద్ధి, సుందరీకరణలో భాగంగా పారిశుధ్యం, స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇచ్చి కడప నగరాన్ని ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన సుందర నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఏమాత్రం ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా రోడ్ల విస్తరణ చేపడతామన్నారు. పేదవ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చెత్త పన్ను (క్లాప్‌ కార్యక్రమం), ట్రేడ్‌ లైసెన్స్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి చైతన్యవంతులను చేస్తామని చెప్పారు. కడప నగర మేయర్‌ కె.సురేష్‌బాబు మాట్లాడుతూ నగరంలో తాగునీరు, పరిశుభ్రత, పారిశుధ్యంతోపాటు నగర సుందరీకరణకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామన్నారు. ఇంటింటి చెత్త సేకరణపై ఆయా డివిజన్ల కార్పొరేటర్లకు ఎదురైన సమస్యలపై నిర్దిష్ట ప్రణాళికతో చర్యలు చేపట్టి సానుకూల వాతావరణాన్ని సమకూరుస్తామన్నారు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి నగరాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.  

అంతకుముందు కౌన్సిల్‌ సమావేశం అజెండాలో పొందుపరిచిన తొమ్మిది అంశాలతోపాటు ప్రధానంగా నగరంలోని అన్ని బీటీ,  సీసీ రోడ్లు పూర్తి చేసి కడప నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు, తాగునీటి వ్యవస్థను శాశ్వత ప్రాతిపదికన మెరుగు పరిచేందుకు ఆమోదం  తెలిపారు. సమావేశంలో డిప్యూటీ మేయర్లు నిత్యానందరెడ్డి, ముంతాజ్‌బేగం, డిప్యూటీ మున్సిపల్‌ కమిషనర్‌ రమణారెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్‌ సభ్యులు, అధికారులు, ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు